తెలంగాణ కమలనాథుల టెన్షన్.. ఆ టార్గెట్ రీచ్ అయ్యేందుకు బీజేపీ నేతల కష్టాలు
ఎన్ని ట్రిక్కులు ఫాలో అయినా.. అధిష్ఠానం ఇచ్చిన 50లక్షల సభ్యత్వ నమోదు టార్గెట్.. నెలాఖరు వరకు కూడా చేరుకుంటామన్న నమ్మకం బీజేపీ వర్గాల్లో కనిపించడం లేదట.

BJP telangana
టార్గెట్ రీచ్ కాలేక.. ఎక్కడ హైకమాండ్ కోపాన్ని చూడాల్సి వస్తుందేమోనని భయంతో.. తెలంగాణ బీజేపీ నేతలు పడుతున్న కష్టాలు అన్నీ ఇన్నీ కావు పాపం. సభ్యత్వ నమోదు టార్గెట్ కొండంత ఉంటే.. గ్రౌండ్‌లో మాత్రం గోరంత పనే జరుగుతోందట. దీంతో ఎలాగైనా టార్గెట్ రీచ్ అయ్యేందుకు కమలం పార్టీ నేతలు కొత్త దారులు వెతుక్కుంటున్నారట.
ఇదేసమయంలో నెలాఖరు వరకు గడువు పొడిగిస్తూ అధిష్ఠానం కూడా మరో చాన్స్ ఇచ్చింది. ఇంతకీ బీజేపీ నేతలు వెతుక్కున్న దారులేంటి.. వారేం చేస్తున్నారు అసలు.. ఇంత చేసినా టార్గెట్ రీచ్ అవుతామన్న నమ్మకం వాళ్లకెందుకు రావడం లేదు..
పార్టీ సభ్యత్వ నమోదు రూపంలో.. తెలంగాణ బీజేపీ నేతలకు కొత్త టెన్షన్ వచ్చిపడింది. ఇదే ఇప్పుడు కీలక నేతల గుండెల్లో రైలు పరిగెట్టేలా చేస్తోందీ . అధిష్టానం ఇచ్చిన టార్గెట్ రీచ్ కావడానికి నానా తంటాలు పడుతున్నారట పాపం కమలనాథులు. సెప్టెంబర్ 8న రాష్ట్రంలో బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమం షురూ అయింది.
సగం సభ్యత్వాలు కూడా పూర్తి చేయలేకపోయారా?
తెలంగాణలో 50లక్షల పార్టీ సభ్యత్వాలు నమోదు చేయాలని ఢిల్లీ పెద్దలు.. ఇక్కడి నేతల ముందు ఓ టార్గెట్ పెట్టి వెళ్లిపోయారు. దీనికోసం ప్రత్యేకంగా జిల్లాలవారీగా ప్రభారీలను నియమించి.. వారి మీద ఇన్‌చార్జిలతో పర్యవేక్షణ ఏర్పాటు చేసింది. ఐతే తెలంగాణ బీజేపీ నేతలు మాత్రం అనుకున్న లక్ష్యాన్ని చేరుకోలేకపోయారు. 50 లక్షల్లో కనీసం సగం సభ్యత్వాలు కూడా పూర్తి చేయలేకపోయారని తెలుస్తోంది. ఇదే ఇప్పుడు తెలంగాణ కమలం పార్టీ నేతలకు చెమట్లు పట్టిస్తున్నాయని టాక్.
సెప్టెంబర్‌లో భారీ వర్షాల కారణంగా… సభ్యత్వ నమోదు సజావుగా సాగలేదని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి.. అధిష్టానానికి విన్నవించుకున్నారు. దీంతో హైకమాండ్ ఓ చాన్స్ ఇచ్చింది. మెంబర్‌షిప్ డ్రైవ్ కోసం రెండు సార్లు గడువు పెంచి.. ఈనెలాఖరు వరకు డెడ్‌లైన్ విధించారు ఢిల్లీ పెద్దలు. వర్షాలు తగ్గాయ్.. వరదలు పోయాయ్.. ఇప్పుడు గ్రౌండ్ అంతా క్లియర్.
ఐనా సరే.. సభ్యత్వాలు 25లక్షలకు మించి అవలేదని తెలుస్తోంది. ఇప్పటివరకు అయిన మెంబర్‌షిప్‌లలో 8లక్షల మేర సభ్యత్వాలు మిస్డ్ కాల్ రూపంలో అయ్యాయని తెలుస్తోంది. ఇదే ఇప్పుడు తెలంగాణ బీజేపీ నేతలకు నిద్రలేకుండా చేస్తోందట. ఎక్కడ హైకమాండ్ కోపానికి గురి కావాల్సి వస్తుందేమోననే ఆలోచనే.. వారిని స్థిమితంగా ఉండనివ్వడం లేదని సమాచారం. దీంతో బీజేపీ నేతలు అడ్డదారిని ఎంచుకున్నారట.
ఏజెన్సీలతో అవగాహనా ఒప్పందాలు?
పార్టీ సభ్యత్వ నమోదు కోసం… కొందరు బీజేపీ నేతలు ప్రైవేట్ ఏజెన్సీలను ఆశ్రయించారని టాక్. మండలాలు, నియోజకవర్గాలు, జిల్లాలవారీగా.. పార్టీ మెంబర్‌షిప్ కోసం ఏజెన్సీలకు కాంట్రాక్టు అప్పగించారట. అనుకున్న గడువు లోపు ఎవరి పడితే వారిని.. ఎలాగోలా పార్టీ సభ్యులుగా చేర్పించాలని.. సదరు ఏజెన్సీలతో కాంట్రాక్ట్ కుదుర్చుకున్నారనే చర్చ జరుగుతోంది.
దీనికోసం మండలానికో రేటు… నియోజకవర్గానికి, జిల్లాకో రేటు చొప్పున… భారీ మొత్తంలో డబ్బులు చెల్లిస్తున్నారట బీజేపీ నాయకులు. మండలానికి వెయ్యి సభ్యత్వాలు… నియోజకవర్గానికి 5వేల సభ్యత్వాల టార్గెట్‌తో ఏజెన్సీలతో అవగాహనా ఒప్పందాలు కుదుర్చుకున్నారన్న గుసగుసలు వినిపిస్తున్నాయ్. దీంతో గత వారంరోజులుగా సుమారు ఆరేడు జిల్లాల్లో 10 నుంచి 12 ఏజెన్సీలు బీజేపీ సభ్యత్వ నమోదు కోసం రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది.
సభ్యత్వ నమోదు విషయంలో టార్గెట్ రీచ్ కావడానికి.. గ్రామస్థాయిలో ఏజెంట్లను నియమించుకున్నారట మరికొందరు బీజేపీ నేతలు. ఒక్కో సభ్యత్వానికి ఇంత రేటు అని ఫిక్స్ చేసి మరీ మెంబర్‌షిప్ చేయిస్తున్నారని సమాచారం. ఏ పార్టీ వారు అయినా సరే.. ప్రతీ సభ్యత్వానికి 50 రూపాయల నుంచి 100 రూపాయల వరకు చెల్లించి మరీ సభ్యత్వాలు చేస్తున్నారని తెలుస్తోంది.
ఇలా తెలంగాణ వ్యాప్తంగా టార్గెట్ రీచ్ కాని చాలా జిల్లాల్లో.. ఏజెంట్లను పెట్టుకుని మరీ… డబ్బులు ఇచ్చి పార్టీ సభ్యత్వాలను నమోదు చేయిస్తున్నారట బీజేపీ నేతలు. మిస్డ్ కాల్ ద్వారా సభ్యత్వ నమోదు చేసుకునే వెసులుబాటు ఉండటంతో.. ప్రతీ మిస్డ్ కాల్‌కు 20 రూపాయల నుంచి 50 రూపాయల వరకు ఇచ్చి.. సభ్యత్వాలను పూర్తి చేస్తున్నారన్న చర్చ జరుగుతోంది.
ఇంత చేసినా.. ఇన్ని ట్రిక్కులు ఫాలో అయినా.. అధిష్ఠానం ఇచ్చిన 50లక్షల సభ్యత్వ నమోదు టార్గెట్.. నెలాఖరు వరకు కూడా చేరుకుంటామన్న నమ్మకం బీజేపీ వర్గాల్లో కనిపించడం లేదట. డేట్ ముందుకు జరుగుతుంది కానీ.. ప్రొగ్రెస్ జరగడం లేదనే గుసగుసలు పార్టీ ఆఫీస్‌లోనే వినిపిస్తున్నాయ్. ఏమైనా తెలంగాణలో సగం ఎంపీలను గెలిచిన కమలం పార్టీ.. ఇలా సభ్యత్వ నమోదు కోసం ఏజెన్సీల ద్వారా మెంబర్ షిప్ చేయడం, సభ్యత్వానికి ఇంత అని డబ్బులు ముట్టజెప్పడం.. ఏంటో ఈ ఖర్మ అని నిట్టూరుస్తున్నారు జనం.