Revanth Reddy (Photo : Twitter)
Revanth Reddy : తెలంగాణలో ఎన్నికల హీట్ కనిపిస్తోంది. అధికార, ప్రతిపక్షాలు ఎలక్షన్స్ కు రెడీ అయిపోయాయి. వ్యూహాలు, ప్రతి వ్యూహాలు రచిస్తున్నాయి. మరోసారి అధికారమే లక్ష్యంగా బీఆర్ఎస్ ప్రణాళికలు రూపొందిస్తుంటే.. ఎలాగైనా ప్రభుత్వం ఏర్పాటు చేయాలని కాంగ్రెస్, బీజేపీ లక్ష్యంగా పెట్టుకున్నాయి. ఈ క్రమంలో అధికార, ప్రతిపక్షాల నేతల మధ్య మాటల యుద్ధం తారస్థాయికి చేరింది.
టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి.. కేసీఆర్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. కేసీఆర్ పతనానికి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఖమ్మం జిల్లా నేతలు పునాది వేస్తున్నారని చెప్పారు. ఖమ్మంలో జరిగే బహిరంగ సభ.. కేసీఆర్ అధికారానికి చివరి రోజు అవుతుందని రేవంత్ రెడ్డి అన్నారు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి నివాసంలో రేవంత్ రెడ్డి మాట్లాడారు.
”తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం పరితపించిన జయశంకర్ సార్ వర్దంతి నేడు. ఆయన స్ఫూర్తితో ఆనాడు తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగసింది. ఆయన సిద్ధాంతాలకు ఆకర్శితులై ఉద్యమంలో అందరూ కలిసి వచ్చారు. వారి స్ఫూర్తితో ఉద్యమంలో పాల్గొన్న విద్యార్థులు ప్రాణత్యాగాలతో తెలంగాణ తెచ్చారు.
తెలంగాణ వచ్చాక కేసీఆర్ కుటుంబానికి తప్ప ఎవరికీ ప్రయోజనం చేకూరలేదు. ఆనాడు తెలంగాణతో కేసీఆర్ కు పేగు బంధం లేదు. ఈనాడు తెలంగాణతో కేసీఆర్ కు పేరు బంధం లేదు. తెలంగాణ సెంటిమెంట్ తో రాష్ట్రాన్ని కేసీఆర్ దోచుకున్నారు. తెలంగాణకు పట్టిన గులాబీ చీడను వదిలించడానికే ఈ చేరికలు.
పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఆయన మిత్ర బృందాన్ని కాంగ్రెస్ లోకి ఆహ్వానించాం. కేసీఆర్ వ్యతిరేక రాజకీయ పునరేకీకరణలో భాగంగానే పొంగులేటిని కలిశాం. రామ్ సాహెబ్ సురేందర్ రెడ్డి, జైపాల్ రెడ్డి తెలంగాణ ఏర్పాటు ప్రక్రియలో కీలక పాత్ర పోషించారు. ఇక కేసీఆర్ నుంచి తెలంగాణకు విముక్తి కలిగించాలని మేమంతా నిర్ణయం తీసుకున్నాం. ఖమ్మం జిల్లాలో కీలక నేతల సూచన మేరకు పొంగులేటిని, ఆయన మిత్ర బృందాన్ని కాంగ్రెస్ లోకి ఆహ్వానించాం. కేసీఆర్ పతనానికి పొంగులేటి, ఖమ్మం జిల్లా నేతలు పునాది వేస్తున్నారు.
త్వరలోనే ఢిల్లీకి వెళ్లి రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులను పార్టీ పెద్దలకు వివరిస్తాం. ఖమ్మంలో జరిగే బహిరంగ సభ కేసీఆర్ అధికారానికి చివరి రోజు అవుతుంది. కృష్ణా పరివాహక ప్రాంతం మొత్తం కాంగ్రెస్ కు అండగా నిలబడేందుకు సిద్ధంగా ఉంది. హరగోపాల్, విమలక్క, ఉద్యమకారులపై ఉపా కేసులు పెడుతున్న పరిస్థితి రాష్ట్రంలో ఉంది. విమలక్కపై పెట్టిన ఉపా కేసును కూడా ప్రభుత్వం ఉపసంహరించుకోవాలి” అని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు.