డబుల్ బెడ్ రూమ్ ఇల్లు తిరిగి ప్రభుత్వానికి ఇచ్చిన మహిళ

The woman who gave the double bedroom house back to the government : తెలంగాణ ప్రభుత్వం డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పథకాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుని అమలు చేస్తోంది. రాష్ట్రంలో లబ్ధిదారులు డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నారు. కానీ ఓ మహిళ తనకు వచ్చిన డబుల్ బెడ్ రూమ్ ఇల్లును తిరిగి ఇచ్చేసింది. తన పెద్ద మనసును చాటుకుంది. సిద్ధిపేట జిల్లా కేసీఆర్ నగర్‌లో ఓ మహిళ డబుల్ బెడ్ రూం ఇంటిని ప్రభుత్వానికి తిరిగి ఇచ్చేసింది.
సిద్దిపేటలోని కేసీఆర్ నగర్‌కు చెందిన రచ్చ లక్ష్మీ నిరుపేద మహిళ. ఆమె భర్త కొన్నాళ్ల క్రితం చనిపోయాడు. లక్ష్మీ తన కూతురితో కలిసి ఉంటోంది. నిరుపేదరాలు కావడంతో డబుల్ బెడ్ రూమ్ ఇల్లుకు దరఖాస్తు చేసుకుంది. దీంతో కేసీఆర్ నగర్‌లో ఆమెకు ఇల్లు మంజూరైంది. ఇటీవలే లక్ష్మీకి ఆ ఇంటి తాళాలు, పట్టా అందజేశారు.
అయితే ఆమె గొప్ప మనసుతో ఆలోచించింది. తన బిడ్డ పెళ్లి అయితే ఉండేది ఒక్కదాన్నే అనుకుంది. ప్రస్తుతం తమ్ముడి ఇంటి వద్ద ఉంటోంది. ఈ క్రమంలో ఒక్కదానికి ఇంత పెద్ద ఇల్లు అవసరమా? అని తనకు తాను ప్రశ్నించుకుంది. తన లాంటి మరో నిరుపేదకు ఆ ఇంటికి ఇచ్చేందుకు లక్ష్మీ ముందుకొచ్చింది. దీంతో మంత్రి హరీష్‌రావుకు తన అభిప్రాయాన్ని తెలియజేసింది. తాను ఆర్థికంగా మంచి పరిస్థితిలోనే ఉన్నానని.. తనకు మంజూరైన ఇంటిని వేరే ఎవరైనా పేదలకు ఇవ్వండని ఇంటిని మంత్రికి ఇచ్చేసింది.
దీంతో హరీష్ రావు ఆ మహిళను శాలువా కప్పి అభినందించారు. ప్రతీ ఒక్కరూ ఇలా ఉన్నతంగా ఆలోచించాలని కోరారు. లక్ష్మీ లాంటి వారు ఎవరైనా ఉంటే.. ముందుకు రావాలన్నారు. ఆమెను ఆదర్శంగా తీసుకోవాలని మంత్రి అన్నారు. లక్ష్మీ కుటుంబానికి అన్ని విధాలా అండగా ఉంటామని హరీష్ రావు స్పష్టం చేశారు. కలెక్టర్‌కు లక్ష్మీ ఆ ఇంటి తాళాలను, పట్టా కాగితాలను అందజేసింది. ఈ సందర్భంగా లక్ష్మీని శాలువాతో కలెక్టర్ సత్కరించి అభినందించారు.