జగిత్యాల గంగారెడ్డి హత్యపై పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ కీలక వ్యాఖ్యలు..

సీనియర్ నేత జీవన్ రెడ్డితోనూ ఆయన మాట్లాడారు. జీవన్ రెడ్డి ఆవేదనను అర్థం చేసుకుంటానన్నారు.

జగిత్యాల గంగారెడ్డి హత్యపై పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ కీలక వ్యాఖ్యలు..

Mahesh Kumar Goud (Photo Credit : Google)

Updated On : October 22, 2024 / 5:44 PM IST

Mahesh Kumar Goud : జగిత్యాల గంగారెడ్డి హత్య ఘటనపై పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ స్పందించారు. గంగారెడ్డిని హత్య చేసిన వారిపై కఠిన చర్యలు తప్పవన్నారు. పార్టీ ఓ సీనియర్ కార్యకర్తను కోల్పోవడం ఎంతో బాధాకరం అన్నారు. హత్య రాజకీయాలను ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రోత్సహించేది లేదన్నారు. పోలీసులు చాలా కఠినంగా వ్యవహరించాలంటూ జిల్లా ఎస్పీతో ఆయన మాట్లాడటం జరిగింది.

జిల్లాకు చెందిన మంత్రి శ్రీధర్ బాబుతోనూ ఆయన మాట్లాడారు. నేరస్తులు ఎవరు అనేది త్వరగా విచారణ జరిగేలా చూడాలని మహేశ్ కుమార్ గౌడ్ సూచించారు. సీనియర్ నేత జీవన్ రెడ్డితోనూ ఆయన మాట్లాడారు. జీవన్ రెడ్డి ఆవేదనను అర్థం చేసుకుంటానన్నారు.

హత్యకు గురైన గంగారెడ్డి.. కాంగ్రెస్ సీనియర్ నేత, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డికి ప్రధాన అనుచరుడు. ఎమ్మెల్సీ జీవన్ రెడ్డితో పాటు ధర్మపురి ఎమ్మెల్యేగా ఉన్న ప్రభుత్వ విప్ అట్లూరి లక్ష్మణ్ కూడా ఈ హత్య ఘటనపై తీవ్ర నిరసన వ్యక్తం చేస్తూ రోడ్డుపై బైఠాయించారు. ఈ అంశాన్ని కాంగ్రెస్ పార్టీ చాలా సీరియస్ గా తీసుకుంది. ఒక పార్టీ సీనియర్ నేతను దారుణంగా హత్య చేయడం అనేది క్షమించరానిదని, హత్యా రాజకీయాలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించేది లేదని , దీని వెనుక ఎవరి హస్తం ఉన్నా విచారణ జరిపించి కఠిన చర్యలు తీసుకోవాలని భావించింది.

మరోవైపు పార్టీ తీరుపై తీవ్ర అసహనం వ్యక్తం చేస్తూ జీవన్ రెడ్డి కొన్ని వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ నుంచి గెలుపొందిన సంజయ్ కుమార్.. కాంగ్రెస్ లోకి రావడాన్ని జీవన్ రెడ్డి తీవ్రంగా వ్యతిరేకించారు. సంజయ్ కుమార్ పార్టీలోకి వచ్చిన సందర్భంగా తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. దీనికి నిరసనగా మొదట్లో ఎమ్మెల్సీ పదవికి కూడా రాజీనామా చేయాలని ఆయన భావించారు. అయితే, పార్టీ పెద్దలంతా జోక్యం చేసుకుని జీవన్ రెడ్డికి నచ్చజెప్పారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి దీపాదాస్ మున్షీ కూడా జోక్యం చేసుకున్నారు. జీవన్ రెడ్డితో మాట్లాడారు. ప్రస్తుత పరిస్థితుల్లో సంజయ్ కుమార్ చేరిక తప్పనిసరి అని జీవన్ రెడ్డికి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. ఆ తర్వాత ఈ వ్యవహారం కొంతవరకు సద్దుమణిగింది.

తాజాగా తన ప్రధాన అనుచరుడు గంగారెడ్డి హత్యను జీవన్ రెడ్డి జీర్ణించుకోలేకపోతున్నారు. మరోసారి ఆయన కాంగ్రెస్ పార్టీ తీరుపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. తన ప్రధాన అనుచరుడిని హత్య చేసిన వ్యక్తి.. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి వచ్చిన ఎమ్మెల్యే ప్రధాన అనుచరుడు అనే ప్రచారం ఉంది. దీనికి సంబంధించి పోలీసుల విచారణలో నిజాలు తెలియాల్సి ఉంది. కాగా, పోలీసులు కూడా కాంగ్రెస్ లోకి వచ్చిన ఎమ్మెల్యే మాటలే వింటున్నారని, ఆయన కనుసన్నల్లోనే పని చేస్తున్నారని జీవన్ రెడ్డి తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఈ వ్యవహారం పార్టీలో దుమారం రేపడంతో.. నేరుగా మహేశ్ కుమార్ గౌడ్ రంగంలోకి దిగారు. జీవన్ రెడ్డితో మాట్లాడారు. పార్టీ అండగా ఉంటుందని చెప్పే ప్రయత్నం చేశారు. జగిత్యాలలో జరుగుతున్న పరిణామాలను పీసీసీ చీఫ్ తో జీవన్ రెడ్డి ప్రస్తావించినట్లు సమాచారం.

 

Also Read : 4 నెలల నుంచి మానసికంగా అవమానాలకు గురవుతూ వచ్చాం: జీవన్‌ రెడ్డి సంచలన కామెంట్స్‌