MLC Teenmar Mallanna : ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నపై క్రమశిక్షణ చర్యలకు రంగం సిద్ధమైనట్లు తెలుస్తోంది. రేపో మాపో మల్లన్నకు టీపీసీసీ షోకాజ్ నోటీసులు ఇవ్వనున్నట్లు సమాచారం. మల్లన్నకు నోటీసులు ఇవ్వాలని క్రమశిక్షణ కమిటీ నిర్ణయం తీసుకుంది.
మల్లన్న ఓ వర్గాన్ని తీవ్రంగా దూషించారని, సొంత పార్టీపైనే తీవ్ర విమర్శలు చేస్తున్నారని టీపీసీసీ చీఫ్ కి నేతలు, కార్యకర్తల నుంచి ఫిర్యాదులు అందినట్లు తెలుస్తోంది. కులగణన సర్వేపై పార్టీ విధానాలకు విరుద్ధంగా మల్లన్న మాట్లాడినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో క్రమశిక్షణ కమిటీ నోటీసులు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.
Also Read : కాంగ్రెస్‌లో చేరిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు నోటీసులు.. నెక్ట్స్ ఏం జరగనుంది?
కులగణన సర్వే రిపోర్ట్ ను తగలబెట్టాలంటూ తీవ్ర వ్యాఖ్యలు..
కాంగ్రెస్ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న కులగణన సర్వే అంశంతో పాటు పలు ఇష్యూలపై చేసిన వ్యాఖ్యలు వివాదానికి దారితీశాయి. ఇటీవల వరంగల్ లో జరిగిన బీసీ గర్జన సభలో తీన్మార్ మల్లన్న చేసిన వ్యాఖ్యలు చిచ్చు రాజేశాయి. చాలా మంది కాంగ్రెస్ పార్టీ నేతలు మల్లన్నపై ఫిర్యాదులు చేస్తున్నారు.
కులగణన సర్వే రిపోర్ట్ ను తగలబెట్టాలి అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. అలాగే ఓ వర్గానికి సంబంధించి ఆయన చేసిన కామెంట్స్ ను ఆ వర్గ నేతలు తీవ్రంగా తప్పుపట్టారు. వారంతా మల్లన్నపై టీపీసీసీ చీఫ్ కు ఫిర్యాదు చేశారు.
ఈ అంశంపై అసెంబ్లీ లాబీలో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సైతం స్పందించారు. కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచి కాంగ్రెస్ పార్టీపైనే ఇలా విమర్శలు చేయడం కరెక్ట్ కాదన్నారు. మొత్తంగా తీన్మార్ మల్లన్న చేసిన కామెంట్స్ పై పీసీసీ కాస్త సీరియస్ గా ఉందని చెప్పొచ్చు.
మల్లన్న అసలేమన్నారంటే..
కులగణన సర్వే ఓ దొంగ సర్వే అని మల్లన్న ఆరోపించారు. బీసీలను రాష్ట్ర ప్రభుత్వం తప్పుదోవ పట్టిస్తోందని మండిపడ్డారు. అంతేకాదు కులగణన సర్వే పేపర్లను కూడా ఆయన తగలబెట్టారు. ఈ సర్వేను తాము ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోమన్నారు మల్లన్న. సర్వేలో దాదాపు 40 లక్షల మంది బీసీలను తగ్గించటం అన్యాయం అని.. ఈ విషయాన్ని బీసీలు సహించరని మల్లన్న తేల్చి చెప్పారు.
మరోవైపు రెడ్డి సంఘాల నేతలు మల్లన్నపై డీజీపీకి ఫిర్యాదు చేశారు. వరంగల్ లో బీసీ బహిరంగ సభలో తమ వర్గాన్ని తీవ్ర పదజాలంతో మల్లన్న దూషించారని, వెంటనే ఆయనపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో కోరారు. బీసీల కోసం పోరాడటంలో తప్పులేదు, కానీ, మా కులాన్ని దూషించడం ఎందుకు? అని మల్లన్నపై మండిపడ్డారు.