Kamareddy Twins Wedding : కవల సోదరులకు కవలలతో పెళ్లి.. విహామైన నెల రోజులకే తీవ్ర విషాదం
Kamareddy Twins Wedding : కవల సోదరలకు ఇద్దరికీ.. కవల సోదరీమణులతో జరిగిన వివాహం దేశవ్యాప్తంగా వైరల్ అయ్యింది. కానీ నెల రోజుల్లోపే వారి ఇంట తీవ్ర విషాదం అలుముకుంది.
tragic incident happened after one month of twin brothers marriage with twin sisters at kamareddy
Kamareddy Twins Wedding : వారిద్దరూ కవల సోదరులు. చిన్ననాటి నుంచి ఒకే ప్రాణంగా పెరిగారు. కవల బిడ్డలను చూసుకుని ఆ తల్లిదండ్రులు మురిసిపోయారు. అల్లారుముద్దుగా పెంచుకున్నారు. ఆ ఇద్దరు అన్నదమ్ములు బాగా చదువుకుని మంచి ఉద్యోగాల్లో స్థిరపడ్డారు. పెళ్లీడుకొచ్చిన తమ బిడ్డలకు వివాహం చేయాలని భావించిన తల్లిదండ్రులు.. కవల ఆడపిల్లలతో వారికి పెళ్లి కుదిర్చారు. నెల రోజుల క్రితం కవల సోదరుల వివాహం వారి స్వగ్రామంలో ఘనంగా జరిగింది. ఆ కవల పిల్లల పెళ్లి వేడుక చూసి గ్రామస్థులంతా మురిసిపోయారు. తమ కొడుకులు పిల్లాపాపలతో నిండు నూరేళ్లు సంతోషంగా బతకాలని తల్లిదండ్రులు కోరుకున్నారు. మరి ఇంతలో ఏం జరిగిందో ఏంటో తెలియదు కానీ.. కవల సోదరుల్లో ఒకరు కాలువలో దూకి ఆత్మహత్య చేసుకున్నారు. పెళ్లైన నెల రోజులకు అతడు తీసుకున్న కఠిన నిర్ణయం నవవధువుతో పాటు తల్లిదండ్రులకు జీవితాంతం తీరని దుఃఖాన్ని మిగిల్చింది.
ఈ విషాద సంఘటన గురించి పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలం ఘన్పూర్ గ్రామానికి చెందిన కవల సోదరులు దుంపటి విజయ్, వినయ్ కుమార్లకు ఫిబ్రవరి నెలలో వివాహం అయ్యింది. దేమిక్లాన్కు చెందిన కవల సోదరీమణులు కీర్తన, కీర్తిలతో వీరి వివాహం ఘనంగా జరిగింది. ఉగాది పండగ నేపథ్యంలో వినయ్ తన భార్యతో కలిసి స్వగ్రామమైన ఘన్పూర్కు వచ్చాడు. కుటుంబ సభ్యులతో కలిసి పండగ చేసుకోవాల్సిన ఆ వ్యక్తి.. దారుణ నిర్ణయం తీసుకున్నాడు.
గురువారం నాడు ఇంట్లో ఎవరికీ చెప్పకుండా బయటకు వెళ్లాడు. సాయంత్రం అవుతున్నా తిరిగి రాలేదు. ఫోన్ చేసినా లాభం లేకపోయింది. దీంతో వినయ్ ఆచూకీ కోసం గాలించడం మొదలుపెట్టారు. ఈ క్రమంలో చివరకు రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం నర్మాల ఎగువ మానేరు ప్రాజెక్టు కాలువ వద్ద వినయ్ ఆచూకీ లభ్యమైంది. అయితే అప్పటికే అతడు కాలువలోకి దూకి చనిపోయాడు.
పెళ్లై పట్టుమని నెల రోజులు కూడా గడవకముందే.. వినయ్ ఇంతటి దారుణానికి ఒడిగట్టడం ప్రతి ఒక్కరినీ కలచివేస్తోంది. భార్యతో కలిసి సంతోషంగా ఉంటాడని భావించిన కొడుకు.. అర్ధాంతరంగా తనువు చాలించడంతో అతడి తల్లిదండ్రులు గుండెలు పగిలేలా ఏడుస్తున్నారు. ఇక వినయ్ భార్య కీర్తి పరిస్థితి వర్ణనాతీతంగా ఉంది. కోటి ఆశలతో వివాహ బంధంలోకి అడుగుపెట్టిన ఆమె కలలు నెల రోజుల్లోనే కూలిపోయాయి. వినయ్ మరణ వార్త తెలిసి ఆమె షాక్కు గురైంది. పెళ్లైన నెల రోజులకే భర్తను కోల్పోయిన బిడ్డను చూసి ఆమె తల్లిదండ్రులు గుండెలు పగిలేలా ఏడుస్తున్నారు.
ఈ వివాహం జరిగినప్పుడు సోషల్ మీడియాలో భారీగా వైరల్ అయ్యింది. కవలలు కవలలను పెళ్లి చేసుకోవడం ఒక విశేషమైతే, వారు ఎంతో అన్యోన్యంగా ఉండటం చూసి అందరూ ముచ్చటపడ్డారు. కానీ పెళ్లయిన వినయ్ ఆత్మహత్య చేసుకోవడంతో కుటుంబ సభ్యులు శోకసముద్రంలో మునిగిపోయారు. పండుగ పూట ఘన్పూర్ గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
