మంటల్లో చెట్లు.. తెలుగు రాష్ట్రాల్లో బూడిదవుతోన్న అడవులు

Trees are burning: తెలుగు రాష్ట్రాల్లో అడవులు దగ్ధం అవుతున్నాయి. వరుస ప్రమాదాలతో అటవీ, అగ్నిమాపక శాఖలు ఉలిక్కిపడుతుండగా.. నల్లమల అడవుల్లో కొన్ని రోజుల క్రితం చెలరేగిన మంటల్ని మర్చిపోకముందే మరోసారి మంటలు అంటుకున్నాయి. లేటెస్ట్‌గా నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్‌లోని నల్లమల అడవుల్లో మంటలు రాజుకున్నాయి. రాత్రంతా మంటలకు మొక్కలు, చెట్లు మాడిపోయాయి.

గుడిగట్టు ప్రాంతంలో మంటలు చెలరేగగా.. దట్టమైన అటవీప్రాంతం కావడంతో గట్టుకు చేరుకునేందుకు అటవీ, అగ్నిమాపక సిబ్బంది చాలా కష్టపడుతున్నారు. కొల్లపూర్ ఫారెస్ట్‌ రేంజ్ ఆఫీసర్ రవీంద్రనాయక్‌ నేతృత్వంలో సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలు అదుపులోకి తెచ్చేందుకు యత్నించారు. గంటల తరబడి యత్నించినా మంటలు అదుపులోకి రాలేదు. ఈ ప్రాంతానికి పెద్ద వాహనాలే కాదు బైక్‌లు పోయేందుకు కూడా వీలులేదు. దీంతో అధికారులు కాలినడకన 8 కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్లి గుడిగట్టుకు చేరుకున్నారు.

నల్లమలకు వచ్చే సందర్శకులు, భక్తులను అగ్గిపెట్టెలు, స్టవ్‌లు తీసుకురాకుండా అధికారులు చర్యలు తీసుకున్నారు. పొయ్యి రాజేయవద్దని భక్తులపై ఆంక్షలు విధించారు. అయినా కూడా అడవిలో తరచుగా మంటలు వ్యాపిస్తున్నాయి. ఇప్పుడే ఇలా ఉంటే.. మున్ముందు మండు వేసవి ప్రతాపం ఎక్కువైతే ఇంకెలాంటి పరిస్థితులు వస్తాయోనని అధికారులు, స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

నల్లమలలోనే కాదు.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని అటవీప్రాంతంలో మంటలు చెలరేగాయి. గుండాల-కాచనపల్లి మధ్య అటవీప్రాంతంలో.. మంగళవారం రాత్రి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. గంటల తరబడి కొనసాగిన ఈ కార్చిచ్చులో గుండాల పస్రా, గుండాల రంగాపురం మధ్య అడవిలో వేలాది వృక్షాలు కాలిపోయాయి. మన్యంలో మంటలతో గిరిజనులు ఉలిక్కిపడ్డారు. అటవీశాఖ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండడంతో అగ్నిప్రమాదాలు సంభవిస్తున్నాయని ఆదివాసీలు ఆరోపిస్తున్నారు. అడవుల్లో వృక్ష సంపద కాలిబూడిదవుతున్నా సకాలంలో పట్టించుకోకుండా అలసత్వం కనబర్చారంటూ ఆగ్రహం వ్యక్తచేస్తున్నారు.

ఈ నెల 13వ తేదీన … విశాఖ జిల్లా సబ్బవరం మండలం ఎల్లుప్పి గ్రామ శివార్లలోని రిజర్వ్ ఫారెస్ట్‌లో మంటలు చెలరేగాయి. గాలులకు కార్చిచ్చులా అటవీప్రాతం దగ్ధమైంది. మంటలు రిజర్వ్ ఫారెస్ట్‌ను ఆనుకుని వందలాది ఎకరాల్లో జిరాయితీ భూములకు పాకాయి. దీంతో స్థానికులు పండించిన నీలగిరి, జీడి, మామిడి తోటలు దగ్ధమయ్యాయి. కార్చిచ్చుకు తోటలు దగ్ధమవడంతో ఎల్లుప్పి, మర్రిపాలెం రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.

ఏపీ, తెలంగాణలో ఇటీవల అటవీప్రాంతాల్లోనూ, ఆ పక్కనే ఉన్న భూముల్లోనూ మంటలు చెలరేగుతుండడంతో వేసవిలో ఇంకెన్ని కార్చిచ్చులు చెలరేగుతాయోననే ఆందోళనలు గిరిజనులున్నారు. ప్రమాదం గురించి తెలుసుకున్న వెంటనే సంబంధిత శాఖల అధికారులు, ఫైరింజన్లు ఘటనాస్థలికి చేరేటప్పటికే అడవుల్లో మంటలు దావానలంలా వ్యాపిస్తున్నాయి.

ట్రెండింగ్ వార్తలు