2 ఎకరాల పొలం, రూ.5 లక్షలు క్యాష్ డీల్.. ఆపరేషన్ చేసి కిడ్నీ తీసుకున్నారు.. కట్ చేస్తే..
మహబూబాబాద్ జిల్లా కురవి మండలంలో దారుణం జరిగింది. పొలం కొనిస్తాం.. డబ్బులు కూడా ఇస్తామంటూ ఆశ చూపి ఓ గిరిజనుడి నుంచి కిడ్నీ తీసుకున్నారు.

Mahabubabad: మహబూబాబాద్ జిల్లా కురవి మండలంలో దారుణం జరిగింది. పొలం కొనిస్తాం.. డబ్బులు కూడా ఇస్తామంటూ ఆశ చూపి ఓ గిరిజనుడి నుంచి కిడ్నీ తీసుకున్నారు. కిడ్నీ ఇచ్చిన తరువాత అతనికి సరియైన ట్రీట్మెంట్ ఇప్పించకపోవటంతో ప్రస్తుతం ఆ గిరిజనుడి ఆరోగ్యం విషమించింది. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. విషయం తెలుసుకున్న కుమార్తె పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
కురవి మండలంలోని రాజోలు గ్రామ శివారు పోలేంపల్లి తండాకు చెందిన ధరావత్ చిట్టిబాబుకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. అదే తండాకు చెందిన ఓ వ్యక్తి చిట్టిబాబు వద్దకు వెళ్లి కిడ్నీ ఇస్తే రెండెకరాల పొలం, రూ.5లక్షలు ఇస్తారని చెప్పాడు. దీంతో అతను కిడ్నీ ఇచ్చేందుకు ఒప్పుకోవటంతో హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లి కిడ్నీ తీసుకున్నారు. ఆ తరువాత చిట్టుబాబుకు సరైన వైద్యం ఇప్పించక పోవటంతో అతని ఆరోగ్యం క్షీణించింది. అగ్రిమెంట్ ప్రకారం డబ్బులు, పొలం కూడా ఇవ్వలేదు. తండ్రి ఆరోగ్యం బాగాలేకపోవటంతో కుమార్తె ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లగా.. చిట్టుబాబుకు ఒక కిడ్నీ లేదని, మిగిలిన ఒక్క కిడ్నీలో సమస్య ఏర్పడడంతో ఆయన అనారోగ్యానికి గురైయ్యాడని చెప్పారు. ప్రస్తుతం అతని ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. దీంతో కుమార్తె పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది.
చిట్టిబాబు కిడ్నీ ఇచ్చిన టైంలో అగ్రిమెంట్ పేపర్స్ పై అతడి కుమారులు నితిన్, రాంసైతం సంతకాలు చేసినట్లు తెలుస్తోంది. అగ్నిమెంట్ ప్రకారం.. ఐదు లక్షలు, రెండు ఎకరాల పొలంకూడా చిట్టబాబుకు ఇవ్వలేదు. తండ్రి ఆరోగ్యం విషమంగా ఉన్నప్పటికీ.. అతని ఇద్దరు కుమారుల జాడలేకపోవటం గమనార్హం. అయితే, చిట్టిబాబు నుంచి తీసుకున్న కిడ్నీని కురవి మండలం నల్లెల గ్రామానికి చెందిన మరో గిరిజనుడికి అమర్చినట్లు సమాచారం. అయితే, ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు.