ఎమ్మెల్సీ ఎన్నికలు, సిట్టింగ్ స్థానాన్ని నిలబెట్టుకునేందుకు టీఆర్ఎస్ వ్యూహాలు

trs strategy: పట్టభద్రుల నియోజకవర్గాలకు ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్నాయి. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు మొదలయ్యాయి. పార్టీలన్నీ ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నాయి. నల్లగొండ-వరంగల్-ఖమ్మం పట్టభద్రుల నియోజకవర్గంలో ప్రస్తుతం టీఆర్ఎస్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఎలాగైనా సిట్టింగ్ స్థానాన్ని నిలబెట్టుకొనేందుకు టీఆర్ఎస్ వ్యూహాత్మకంగా ముందుకెళ్తోంది. పట్టభద్రుల ఓట్ల నమోదులో కూడా దూసుకువెళ్తోంది. విజయంలో కీలకంగా మారనున్న ఓటర్ల నమోదుపై పూర్తి స్థాయిలో దృష్టి సారించి అడుగులు వేస్తోంది.
మరోసారి గెలవాలనే సంకల్పం:
మరోవైపు కాంగ్రెస్ సహా ఇతర రాజకీయ పార్టీల్లో నేటికీ స్పష్టత కొరవడింది. నేతలెవరూ ఇటువైపు దృష్టి పెట్టిన దాఖలాలు కూడా లేవు. పల్లా రాజేశ్వర్‌రెడ్డి పదవీకాలం 2021 మార్చి 29తో ముగియనుంది. 2007, 2009, 2015లో జరిగిన పట్టభద్రులు ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ పార్టీ విజయం సాధించింది. 2021 మార్చిలో జరుగనున్న ఎన్నికల్లోనూ మరోసారి విజయభేరి మోగించాలన్న సంకల్పంతో టీఆర్‌ఎస్ ఉంది. అందుకే పార్టీ యంత్రాంగమంతా పట్టభద్రులు ఎన్నికలపై దృష్టి సారించింది.
టీఆర్ఎస్ అభ్యర్థి విషయంలో అస్పష్టత:
వాస్తవానికి టీఆర్ఎస్ అభ్యర్థి విషయంలో స్పష్టత లేదని అధికార పార్టీ నేతలే ఆఫ్ ద రికార్డుల్లో చెబుతున్నారు. సిట్టింగ్‌గా ఉన్న ప్రభుత్వ విప్ పల్లా రాజేశ్వర్‌రెడ్డి సుముఖంగా లేరనే ప్రచారం జరుగుతోంది. అయితే ఆయన అభ్యర్థిత్వానికే గులాబీ బాస్ మొగ్గు చూపుతున్నట్లు ఆ పార్టీలో పలువురు నేతలు చెబుతున్నారు. ఈ విషయంలో పలు రకాలుగా ప్రచారాలు జరుగుతున్నా.. అభ్యర్థి ఎవరన్నది సంబంధం లేకుండా గెలుపే లక్ష్యంగా పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు ఓటర్ల నమోదులో టీఆర్‌ఎస్ శ్రేణులంతా క్షేత్ర స్థాయిలో పని చేస్తున్నాయి.
చేతులెత్తేసిన కాంగ్రెస్, బీజేపీ:
ఎమ్మెల్సీ బరిలో ఆది నుంచే కాంగ్రెస్, బీజేపీ శ్రేణులు చేతులెత్తేసినట్లుగా కనిపిస్తోంది. సెప్టెంబర్ 23న ఈసీ షెడ్యూల్ ప్రకటించగా, అక్టోబర్ 1 నుంచే ఓటర్ల నమోదు ప్రక్రియ మొదలైనా ఆ పార్టీల నాయకులు రంగంలోకి దిగిన దాఖలాల్లేవు. కాంగ్రెస్ నేతలు అక్కడక్కడా జిల్లాలో పలు కార్యక్రమాల్లో పాల్గొంటున్నా… ఓటర్ల నమోదుపై మాట్లాడిన సందర్భాలు లేవంటున్నారు. నిత్య కుంపట్లు, సిగపట్లకు మారు పేరైన కాంగ్రెస్‌లో నేతల మధ్య సమన్వయం, సయోధ్య లేకపోవడం అతి పెద్ద సమస్య అంటున్నారు.
జోరు చూపించని బీజేపీ:
పార్టీలో విభేదాల నేపథ్యంలో మూడు పాత జిల్లాల నేతలు కలిసి చర్చించి, ఇందులో భాగస్వామ్యం కావడమనేది దాదాపు అసాధ్యమని ఆ పార్టీ శ్రేణులే చెవులు కొరుక్కుంటున్నాయి. ఇక బీజేపీ కూడా ఈ విషయంలో జోరు చూపించడం లేదు. ఎన్నికల్లో పోటీ చేసేందుకు కొందరు ముఖ్య నేతలు మాత్రం రాష్ట్ర పార్టీ నేతల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. మరోవైపు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీపై వామపక్షాలు ఇంకా సమాలోచనల దశలోనే ఉన్నాయి.
ఖర్చు భరించే ధైర్యం లేదు:
ఓటర్ల నమోదు విషయంలో పోటీలో ఉండే అభ్యర్థులు చాలా వ్యయప్రయాసలు ఓర్చుకోవలసి ఉంటుంది. పలు పార్టీల్లో అభ్యర్థిని ఖరారు చేయకపోవడంతో ఖర్చును భరించేందుకు ఎవరూ ముందుకు వచ్చే పరిస్థితి కనిపించడం లేదంటున్నారు. ఈ ఎన్నికల్లో పోటీకి టీజేఎస్, యువ తెలంగాణ పార్టీ, తెలంగాణ ఇంటి పార్టీ నేతలతో పాటు ప్రజా సంఘాల నేతలు కూడా రంగంలో ఉంటారని ప్రచారం జరుగుతోంది. ఈ పరిస్థితుల్లో టీఆర్ఎస్ జోరును అందుకోవడంలో ఇతర పార్టీలు ఎంత వరకు సక్సెస్ అవుతాయో చూడాల్సిందే.