రాజన్న సిరిసిల్ల జిల్లాలో గ్రెనేడ్స్ కలకలం…చెట్టు తొర్రలో రెండు గ్రెనేడ్‌ బాంబులు

  • Publish Date - December 12, 2020 / 07:31 PM IST

Two grenade bombs in Rajna Sirisilla : రాజన్న సిరిసిల్ల జిల్లా గ్రెనేడ్స్ కలకలం రేపింది. ఎల్లారెడ్డిపేట మండలం ధూమలలో రెండు గ్రెనేడ్స్ బయటపడ్డాయి. కొద్దిసేపటి క్రితమే బాంబు డిస్పోజల్ బృందాలు సంఘటనా స్థలానికి చేరుకున్నాయి. ఉదయం నుంచి పోలీసులు రాకపోవడం, గ్రెనేడ్స్ ను తొలగించకపోవడంతో స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఘటనాస్థలంలో మరిన్ని పేలుడు పధార్ధాలు ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పోలీసుల నిర్లక్ష్యంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఓ చెట్టు తొర్రలో రెండు గ్రెనేడ్‌ బాంబులను స్థానికులు గుర్తించారు. చెట్టు దగ్గర చిన్నారులు ఆడుకుంటున్న సమయంలో రెండు గ్రెనేడ్ బాంబులు లభించినట్లు స్థానికులు తెలిపారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని పరిశీలిస్తున్నారు.

పీపుల్స్ వార్, జనశక్తి ప్రభావిత ప్రాంతం కావడంతో ఆ కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. బాంబులు లభించడంపై స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రమాదవశాత్తు బాంబు పేలి ఉంటే… భారీ నష్టం జరిగి ఉండేదని భయాందోళన వ్యక్తం చేస్తున్నారు.

రెండు గ్రెనేడ్స్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. డాగ్ స్క్వాడ్ బృందంతోపాటు పోలీసులు తనిఖీలు చేస్తున్నారు. ఉదయం రెండు గ్రెనేడ్స్ ఇక్కడ లభించాయి. గతంలో ఇది నక్సల్స్, జనశక్తి ప్రభావిత ప్రాంతం. దళాల కదలికలు ఎక్కువగా ఉన్న ప్రాంతంలో ఒక డంపు ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. ఇంకేమైనా గ్రెనేడ్స్ ఉన్నాయా అనేది దర్యాప్తులో వెల్లడయ్యే అవకాశం ఉంది.

ఈ ప్రాంతంలో చెట్ల పొదలతో కూడి ఉంది. అటు గుండా ఎవరు కూడా నడక కొనసాగించే వారు కాదు. జన సందడి కూడా తక్కువగా ఉన్న తరుణంలో ఇక్కడ గ్రెనేడ్స్ లభించడం కొంత ఆందోళన కల్గించే అంశంగా చెప్పుకోవచ్చు. పోలీసులు డాగ్ స్క్వాడ్, బాంబు స్క్వాడ్ బృందాలతో తనిఖీలు నిర్వహిస్తున్నారు.

ఒక్కసారిగా గ్రామాల్లో మాత్రం భయాందోళనకరమైన పరిస్థితి నెలకొంది. ఎప్పుడు కూడా ఈ ప్రాంతంలో గ్రెనేడ్స్, పేలుడు పదార్ధాలు లభించలేదు. ఇవాళ ఒక బాలుడు పేలుడు పదార్థాలను గుర్తించడంతో పోలీసులకు సమాచారం అందించారు.