మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కచ్చితంగా ముఖ్యమంత్రి అవుతారు: కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి

‘నా నాలుక మీద మచ్చ ఉంది. తప్పకుండా ఇది జరిగి తీరుతుంది’ అని అన్నారు.

మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కచ్చితంగా ముఖ్యమంత్రి అవుతారు: కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి

Komatireddy raj gopal reddy: నీటిపారుదల శాఖపై భువనగిరిలో జరిగిన పార్లమెంట్ నియోజకవర్గ స్థాయి సమీక్షా సమావేశంలో ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. భవిష్యత్తులో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కచ్చితంగా ముఖ్యమంత్రి అవుతారని చెప్పారు. ఈ సమావేశంలో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస రెడ్డి కూడా పాల్గొన్నారు.

అలాగే, ఎమ్మెల్యేలు అనిల్ కుమార్ రెడ్డి, బీర్ల అయిలయ్య, వేముల వీరేశం, మల్ రెడ్డి రంగారెడ్డి, ఎంపీ కిరణ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న, అధికారులు కూడా పాల్గొన్నారు. అదే సమావేశంలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం గమనార్హం.

‘ఉత్తమ్ భవిష్యత్‌లో ముఖ్యమంత్రి అవుతారు. నా నాలుక మీద మచ్చ ఉంది. తప్పకుండా ఇది జరిగి తీరుతుంది. ఇప్పటికే ఒకసారి సీఎం ఛాన్స్ మిస్ అయింది’ అని రాజగోపాల్ రెడ్డి చెప్పారు. కాగా, కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమంత్రి పదవి కోసం చాలా మంది ఆశలు పెట్టుకున్నారంటూ బీఆర్ఎస్ నేతలు చాలా సార్లు ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే.

ప్రాజెక్టులను పూర్తి చేస్తున్నాం: ఉత్తమ్
మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ సమవేశంలో మాట్లాడుతూ.. బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో ఇరిగేషన్ శాఖ నిధులే అధికంగా దుర్వినియోగం అయ్యాయని, పనులు అంతగా జరగలేదని చెప్పారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ప్రాధాన్య క్రమంలో సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేస్తున్నామని తెలిపారు.

భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో సాగునీటి ప్రాజెక్టులను యుద్ధ ప్రాతిదికన పూర్తి చేస్తామని తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టు డిజైన్‌లో లోపాలున్నాయని చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టు సోర్సుగా దిగువన ప్రాజెక్టులను నిర్మించలేమని, సాగు నీరు ఇస్తామని హామీ ఇవ్వలేమని తెలిపారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాను సస్యశ్యామలం చేయడం తన ధర్మమని తెలిపారు.

Also Read: సీఎం రేవంత్ రెడ్డి తప్పుల చిట్టాను రాస్తున్నాను: ఈటల రాజేందర్