Corona Vaccination
Corona Vaccination : తెలంగాణలో రేపటి నుంచి వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగనుంది. కొద్దిసేపటిక్రితం తెలంగాణకు రెండు లక్షల 27 వేల వ్యాక్సిన్ డోసులు చేరుకున్నాయి. కేవలం మూడు వేల డోసులు అందుబాటులో ఉండడంతో ఈరోజు వ్యాక్సినేషన్‌ను అధికారులు నిలిపేశారు.
టీకాలు రాష్ట్రానికి చేరుకోవడంతో రేపటి నుంచి తిరిగి వ్యాక్సినేషన్ ప్రారంభిస్తామని అధికారులు తెలిపారు. రాష్ట్రంలో కరోనా పెరుగుతుండటంతో వ్యాక్సిన్ కు డిమాండ్ పెరిగింది. వ్యాక్సిన్ డోసుల కో్సం జనాలు బారులు తీరుతున్నారు.
తెలంగాణలో నిన్న కొత్తగా 5వేల 93 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3లక్షల 51 వేల 424 కు చేరింది. రాష్ట్రంలో కరోనా కేసులు నమోదైన తర్వాత ఇవే అత్యధిక కేసులు. కోవిడ్ కేసులు పెరుగుతున్నదృష్ట్యా ప్రభుత్వం కరోనా పరీక్షలను ఎక్కువ సంఖ్యలో చేస్తోంది.
రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం శనివారం 1,29,637 మందికి కరోనా పరీక్షలు నిర్వహించింది. కరోనా వైరస్ బారిన పడి నిన్న 15 మంది మరణించారు. దీంతో ఇప్పటి వరకు మరణించిన వారి సంఖ్య 1,824కి చేరింది. కరోనా నుంచి కోలుకుని 1,555 మంది బాధితులు నిన్న డిశ్చార్జ్ అయి ఇళ్ళకు తిరిగి వెళ్లారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు కోలుకున్న వారి సంఖ్య 3లక్షల 12 వేల 563 కి చేరింది.