తొలి తెలుగు న్యూస్‌ రీడర్‌ శాంతి స్వరూప్‌ కన్నుమూత

భాష, ఉచ్ఛారణలో స్పష్టత, గంభీరమైన గొంతు, వార్తకు తగ్గట్లుగా అందులో గాంభీర్యాన్ని, ఉద్వేగాన్ని ఒలికిస్తూ వార్తలు చదివే..

తొలి తెలుగు న్యూస్‌ రీడర్‌ శాంతి స్వరూప్‌ కన్నుమూత

Shanthi Swaroop

Updated On : April 5, 2024 / 11:27 AM IST

తొలి తెలుగు న్యూస్‌ రీడర్‌ శాంతి స్వరూప్‌ కన్నుమూశారు. గుండెపోటుతో రెండు రోజుల క్రితం హైదరాబాద్ లోని యశోద ఆసుపత్రిలో చేరిన ఆయన చికిత్స పొందుతూ.. ఆరోగ్య పరిస్థితి విషమించి తుదిశ్వాస విడిచారు. 1983లో టెలీ ప్రాంప్టర్ కూడా లేకుండా ఆయన వార్తలు చదివేవారు. స్క్రిప్ట్ లో ఉన్న వార్తలనే బట్టీ పట్టి మరీ శాంతి స్వరూప్ వార్తలు చెప్పేవారు. శాంతిస్వరూప్‌కు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు.

శాంతిస్వరూప్ మృతిపై కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి సంతాపం తెలిపారు. తొలితరం తెలుగు న్యూస్ రీడర్ శాంతిస్వరూప్ అనారోగ్యం కారణంగా కన్నుమూశారని తెలిసి తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నానని కిషన్ రెడ్డి అన్నారు. తెలుగు టీవీ వార్తలకు ఓ ఐకాన్‌గా వారు తనకంటూ ప్రత్యేకతను చాటుకున్నారని చెప్పారు. ఎందరోమంది న్యూస్ రీడర్లకు వారు స్ఫూర్తిగా నిలిచారని అన్నారు.

భాష, ఉచ్ఛారణలో స్పష్టత, గంభీరమైన గొంతు, వార్తకు తగ్గట్లుగా అందులో గాంభీర్యాన్ని, ఉద్వేగాన్ని ఒలికిస్తూ వార్తలు చదివే తీరు, వివిధ అంశాలపై వారికున్న అద్భుతమైన అవగాహన వంటివి తెలుగు వీక్షకులకు శాంతి స్వరూప్ గారిని చేరువచేశాయని కిషన్ రెడ్డి చెప్పారు. సాంకేతికత అంతగా లేని రోజుల్లోనే.. టెలీ ప్రాంప్టర్ లేకుండా వార్తలు చదివేవారని గుర్తుచేసుకున్నారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నానని అన్నారు.

న్యూస్ రీడర్ శాంతి స్వరూప్ మృతి పట్ల మంత్రి పొన్నం ప్రభాకర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. దూరదర్శన్ పేరు చెప్పగానే ఆయన పేరే గుర్తొచ్చేదన్నారు. ఆయన జీవితం నేటి యువతకు స్ఫూర్తిదాయకమని చెప్పారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఆదేవుడిని ప్రార్థిస్తూ, ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నానని తెలిపారు.

తొలితరం తెలుగు న్యూస్ రీడర్ శాంతిస్వరూప్ మరణం విచారకరమని ఎంపీ బండి సంజయ్ అన్నారు. మృదుస్వభావి, వార్తలు చదవడంలో తనకంటూ ప్రత్యేకతను చాటుకున్న వ్యక్తి శాంతి స్వరూప్ అని చెప్పారు. శాంతి స్వరూప్ ఆత్మకు శాంతి చేకూరాలని, కుటుంబసభ్యులకు మనోధైర్యం ప్రసాదించాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నానని అన్నారు.

Also Read: చంద్రబాబు చేసిన ఘోర తప్పిదం ఇదే: విజయసాయిరెడ్డి