Facebook లో రాహుల్ ఫొటోను తొలగించిన రాములమ్మ

  • Published By: madhu ,Published On : November 27, 2020 / 07:13 AM IST
Facebook లో రాహుల్ ఫొటోను తొలగించిన రాములమ్మ

Updated On : November 27, 2020 / 10:31 AM IST

Vijayashanthi Facebook : ఇటు పార్టీ మార్పుపై పరోక్ష సంకేతాలు ఇచ్చారు విజయశాంతి. తన సోషల్‌ మీడియా ఖాతాలను కాషాయం కలర్‌తో నింపేశారు. ఫేస్‌బుక్‌ ప్రొఫైల్‌ పిక్చర్‌లో రాహుల్‌గాంధీ ఫోటోను తొలగించారు. దీంతో ఆమె కాంగ్రెస్‌కు దూరమైనట్లేనని తెలుస్తోంది. 2020, నవంబర్ 27వ తేదీ శుక్రవారం ఆమె కమలం తీర్థం పుచ్చుకునే అవకాశం ఉందని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి.



జాతీయ అధ్యక్షుడు నడ్డా ప్రచారంలో పాల్గొనేందుకు హైదరాబాద్‌ వస్తున్న నేపధ్యంలో ఆయన సమక్షంలోనే తిరిగి కమలం గూటికి చేరొచ్చని తెలుస్తోంది. పార్టీ మార్పుపై చాలాకాలంగా వార్తలు వినిపిస్తున్నప్పటికీ విజయశాంతి మాత్రం అధికారికంగా స్పందించలేదు. విజయశాంతితో పాటు మరికొంత మంది నేతలు బీజేపీలో చేరే అవకాశం ఉంది.



https://10tv.in/moradabad-sp-mp-st-hasan-asks-muslim-boys-to-consider-hindu-girls-their-sisters/
పార్టీ తీరుపై ఎప్పటి నుంచో అసంతృప్తితో ఉన్న విజయశాంతి కాంగ్రెస్ పార్టీకి గుడ్‌బై చెప్పాలని నిర్ణయం తీసుకున్నారని ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే. ఈమె బీజేపీలో చేరతారని ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతోంది. కొన్ని వారాల క్రితం కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి… విజయశాంతి నివాసానికి వెళ్లి స్వయంగా చర్చలు జరిపారు. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ మాణిక్యం ఠాగూర్ స్వయంగా విజయశాంతి ఇంటికి వెళ్లి బుజ్జగించే ప్రయత్నం చేశారు. అయినా ఆమె మెత్తబడలేదు.



కాంగ్రెస్ ప్రచారకమిటీ ఛైర్‌పర్సన్‌గా ఉన్న విజయశాంతి.. ఇటీవలి కాలంలో ఆ పార్టీకి అంటీముట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు. దుబ్బాక ఉపఎన్నిక హోరాహోరీగా జరిగినా…ప్రచార కమిటీకి బాధ్యురాలై ఉండి కూడా.. అటు వైపు కన్నెత్తి చూడలేదు. సోషల్ మీడియాలో కూడా కాంగ్రెస్‌ను గెలిపించమని ఒక్క పోస్ట్ కూడా పెట్టలేదు. బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ పట్ల పోలీసులు వ్యవహరించిన తీరును కూడా విజయశాంతి ఖండించారు. వెంటనే అలర్టైన కాంగ్రెస్ రాష్ట్ర నాయకత్వం.. రాములమ్మను నిలుపుకునేందుకు గట్టి ప్రయత్నాలే చేసింది.



గ్రేటర్ ఎన్నికల ముంగిట… మాజీ మంత్రి సర్వే సత్యనారాయణ, మాజీ ఎమ్మెల్యే భిక్షపతి యాదవ్ ఫ్యామిలీ… కాంగ్రెస్ కు గుడ్‌బై చెప్పాయి. తాజాగా విజయశాంతి కూడా కమలం గూటికి చేరాలని నిర్ణయించుకోవడంతో…కాంగ్రెస్ పార్టీ పరిస్థితి మరింత దయనీయంగా మారింది. గ్రేటర్‌ ఎన్నికల్లో నైనా… పరువు కాపాడుకోవాలనుకున్న హస్తం పార్టీకి…ఇది కోలుకోలేని దెబ్బ అనే చెప్పాలి.