ప్రభుత్వ ఉద్యోగుల వేతన సవరణ, చర్చలు షురూ కావాలె -కేసీఆర్

ప్రభుత్వ ఉద్యోగుల వేతన సవరణ, చర్చలు షురూ కావాలె -కేసీఆర్

Updated On : January 25, 2021 / 7:24 AM IST

Wage revision of government employees : ప్రభుత్వ ఉద్యోగుల వేతన సవరణకు కేసీఆర్‌ సర్కార్‌ సిద్ధమవుతోంది. వేతన సవరణ, ఇతర సమస్యలపై ఉద్యోగ సంఘాలతో చర్చలు ప్రారంభించాలని త్రిసభ్య కమిటీని సీఎం కేసీఆర్ ఆదేశించారు. పీఆర్సీ, పదోన్నతులు, ఇతర సమస్యలపై చర్చలు ప్రారంభించాలని.. వారం, పది రోజుల్లో చర్చలు పూర్తిచేయాలన్నారు. చర్చలు జరిపిన తర్వాత త్రిసభ్య కమిటీ సీఎం కేసీఆర్‌కు నివేదిక అందించనుంది. ఇక త్రిసభ్య కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా మంత్రివర్గంలో చర్చించి.. వేతన సవరణపై రాష్ట్ర ప్రభుత్వం ఓ నిర్ణయం తీసుకోనుంది. ఉద్యోగుల సమస్యలను పరిష్కరించేందుకు సీఎస్ సోమేష్ కుమార్, ఆర్థికశాఖ ముఖ్యకార్యదర్శి రామకృష్ణారావు, నీటిపారుదలశాఖ కార్యదర్శి రజత్‌కుమార్‌తో కమిటీని ఏర్పాటు చేసింది ప్రభుత్వం.

మరోవైపు..

రాష్ట్రంలో రైతులకు ఇబ్బంది రాకుండా చూడాలంటూ.. అధికారులను ఆదేశించారు సీఎం కేసీఆర్‌. వ్యవసాయ శాఖ కాగితం, కలం శాఖగా కాకుండా.. పొలం, హలం శాఖగా మారాలన్నారు. వ్యవసాయ, మార్కెటింగ్ శాఖపై సమీక్ష నిర్వహించారు. వ్యవసారంగంలో తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు సూచనలు చేశారు. వ్యవసాయ, మార్కెటింగ్‌ శాఖల పనతీరులో గుణాత్మక మార్పు రావాలని చెప్పారు.
కేంద్రం కొత్త చట్టాలతో సంబంధం లేకుండా రాష్ట్రంలో మార్కెటింగ్ వ్యవస్థ ఉంటుందని.. దానిని మరింత పటిష్టం చేస్తామని సీఎం కేసీఆర్ తెలిపారు. రాష్ట్రంలో సాగు విస్తీర్ణం బాగా పెరిగిందన్న సీఎం.. ఈ సీజన్‌లో సాగవుతున్న పంటలపై 10 రోజుల్లో స్పష్టత రావాలని ఆదేశించారు. ఏ గుంటలో ఏ పంట వేశారనే లెక్కలు అధికారుల దగ్గర ఉండాలని చెప్పారు.

రైతులు ఎప్పుడూ.. ఒకే పంట వేసే విధానం పోవాలన్నారు సీఎం కేసీఆర్‌. పంట మార్పిడి విధానం రావాలని.. అప్పుడే ఉత్పత్తి పెరిగి లాభాలు వస్తాయన్నారు. గ్రామాల్లో కూలీల కొరత ఉందని, యాంత్రీకరణ మరింత పెరగాలన్నారు. ఇజ్రాయెల్ వెళ్లి.. ఆధునిక సాగుపై పద్ధతులపై అధ్యయనం చేయాలని వ్యవసాయ అధికారులు సీఎం సూచించారు.