Konda Surekhas former OSD Sumanth
Konda Surekha Former OSD sumanth : మంత్రి కొండా సురేఖ మాజీ ఓఎస్డీ సుమంత్ ఎపిసోడ్ రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఉమ్మడి నల్గొండ జిల్లాలోని సిమెంటు కంపెనీల యాజమాన్యాలను సుమంత్ బెదిరించారని ఆరోపణలు ఉన్నాయి. ఈ వ్యవహారాన్ని ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. కాలుష్య నియంత్రణమండలి (పీసీబీ)లో ఓఎస్డీగా నియమితులై.. డిప్యుటేషన్ మీద అటవీ, దేవాదాయ మంత్రి కార్యాలయంలో ఓఎస్డీగా పనిచేసిన సుమంత్ ను తొలగిస్తూ మంగళవారం పీసీబీ కార్యదర్శి ఆదేశాలు జారీ చేశారు.
అయితే, హైదరాబాద్ జూబ్లీహిల్స్ గాయత్రిహిల్స్‌లోని మంత్రి సురేఖ నివాసంలో సుమంత్ ఉన్నారని సమాచారంతో మఫ్టీలో ఉన్న పోలీసులు అక్కడికి చేరుకున్నారు. సుమంత్ పై వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో అతడిని అదుపులోకి తీసుకునేందుకు వెళ్లారు. కొండా సురేఖ కుమార్తె సుస్మిత వారిని ఇంట్లోకి అనుమతించలేదు. దీంతో అర్ధరాత్రి వేళ హైడ్రామా చోటు చేసుకుంది. దీంతో ఎవరీ సుమంత్? ఏంటీ అసలు గొడవ?.. అనే విషయాలపై ప్రజలు ఆరా తీస్తున్నారు.
ఎవరీ సుమంత్..?
ఎన్. సుమంత్ పొల్యూషన్ బోర్డులో కాంట్రాక్ట్ పద్ధతిలో ఉద్యోగిగా నియామకం అయ్యాడు. డిప్యూటేషన్ మీద మంత్రి కొండా సురేఖ ఓఎస్డీగా నియమితులయ్యారు. ఏడాదికోసారి సుమంత్ డిప్యూటేషన్ పొడిస్తూ వస్తున్నారు. ఈ ఏడాది డిసెంబర్ నెలలో సుమంత్ డిప్యూటేషన్ ముగుస్తుంది. మళ్లీ డిప్యూటేషన్ పొడిగింపు కోసం సురేఖ ప్రయత్నం చేస్తున్నారు. ఈలోపే సుమంత్ టెర్మినెట్ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
అనేక ఆరోపణలు..
సుమంత్‌పైన అనేక అవినీతి ఆరోపణలు ఉన్నాయి. ఐఏఎస్ అధికారులకుసైతం నేరుగా ఆదేశాలు జారీ చేసే స్థాయికి సుమంత్ ఎదిగారని అధికార వర్గాల్లో చర్చ ఉంది. అటవీ శాఖల్లో బదిలీలు, ప్రమోషన్లకు లంచాలు తీసుకుంటారని ఆరోపణలు ఉన్నాయి. సెటిల్మెంట్లు, బెదిరింపులకు పాల్పడడం సమంత్ నైజంగా ప్రచారంలో ఉంది.
కొండా దంపతుల కెమార్తె సుస్మిత పటేల్‌కి సుమంత్ క్లాస్‌మేట్. దీంతో కొండా కుటుంబానికి సుమంత్ దగ్గరయ్యాడు. సమంత్ గృహప్రవేశానికి సుస్మిత పటేల్ లండన్ నుంచి ప్రత్యేకంగా వచ్చారు. వరంగల్ తూర్పు నియోజకవర్గంలో రౌడీ షీటర్ గోపాల నవీన్‌రాజ్‌తో కలిసి సుమంత్ సిటిల్మెంట్లు చేస్తాడనే ప్రచారం ఉంది.
సుమంత్ కుటుంబం మీద కూడా వివిధ రకాల ఆరోపణలు ఉన్నాయి. సుమంత్ తండ్రి సుబ్రమణ్యం విద్యుత్ శాఖలో అధికారి. అవినీతి ఆరోపణల కేసులో పలుసార్లు ఉద్యోగం నుండి తొలగించబడ్డారు. సుమంత్ సోదరుడు ఆస్ట్రేలియాలో భార్యను హత్యచేసిన కేసులో కూడా సుబ్రమణ్యం అరెస్ట్ అయ్యారు. హైదరాబాద్ కొంపల్లిలో సుమంత్ కు అధునాతన గృహం, విలాసవంతమైన జీవితం, ఆడి కారు ఉంది.