Konda Surekha-Ponguleti : కొండా సురేఖకు మరో షాక్.. పొంగులేటి అప్పర్ హ్యాండ్… కోమటిరెడ్డి శాఖకు ఫుల్ పవర్స్..

Konda Surekha - Ponguleti : మంత్రి కొండా సురేఖకు మరో షాక్ తగిలింది. పొంగులేటి శ్రీనివాసరెడ్డితో విబేధాల తర్వాత వరుస షాక్ లు తగులుతున్న ...

Konda Surekha-Ponguleti : కొండా సురేఖకు మరో షాక్.. పొంగులేటి అప్పర్ హ్యాండ్… కోమటిరెడ్డి శాఖకు ఫుల్ పవర్స్..

Ponguleti vs konda sureka

Updated On : October 16, 2025 / 11:06 AM IST

Konda Surekha-Ponguleti : మంత్రి కొండా సురేఖకు మరో షాక్ తగిలింది. పొంగులేటి శ్రీనివాసరెడ్డితో విబేధాల తర్వాత వరుస షాక్ లు తగులుతున్న కొండా సురేఖకు మరో ఎదురుదెబ్బ తగిలింది. మేడారం అభివృద్ధి పనుల టెండర్ల పై సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. మేడారం జాతర పనులను పర్యవేక్షణ ఆర్ అండ్ బీ శాఖకు అప్పగించింది. ఈ మేరకు సీఎస్ రామకృష్ణారావు ఆదేశాలు జారీ చేశారు.

వాస్తవానికి మేడారం అభివృద్ధి పనులను దేవాదాయ శాఖ, ఆర్ అండ్ బీ శాఖలు సంయుక్తంగా పర్యవేక్షిస్తున్నాయి. ఇప్పుడు కొండా సురేఖ నిర్వహిస్తున్న దేవాదాయ శాఖ నుంచి తప్పించి ఆ పనుల పర్యవేక్షణ బాధ్యత మంత్రి కోమటిరెడ్డి సారధ్యంలో ఉన్న ఆర్ అండ్ బీ శాఖకు అప్పగించారు. పనులకు సంబంధించిన రికార్డులు అన్నీ ఆర్ అండ్ బీ శాఖకు అప్పగించాలంటూ దేవాదాయ శాఖకు సీఎస్ ఆర్డర్స్ ఇష్యూ చేశారు.

Also Read: Konda Murali : కొండా సురేఖ ఓఎస్డీ ఎపిసోడ్.. కుమార్తె సుస్మిత వ్యాఖ్యలపై స్పందించిన కొండా మురళీ.. మా మధ్య ఎలాంటి విభేదాలు లేవు..

అసలేం జరిగిందంటే..
మేడారంలో అభివృద్ధి పనులకు సంబంధించిన టెండర్ల విషయంలో మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, కొండా సురేఖ మధ్య విబేధాలు తలెత్తాయి. దేవాదాయ శాఖ పరిధిలోని మేడారం టెండర్లలో వరంగల్ ఇంచార్జి మంత్రి పొంగులేటి జోక్యం చేసుకోవటంతో ఆ శాఖకు చెందిన కొండా సురేఖ అసహనం వ్యక్తం చేశారు. రూ.71కోట్ల టెండర్ ను తన మనిషికి ఇప్పించుకునేందుకు పొంగులేటి ప్రయత్నం చేస్తున్నాడని.. శాఖకు మంత్రిగా ఉన్న తనతో సంబంధం లేకుండా అన్ని తానై పొంగులేటి నడిపిస్తున్నారని ఆరోపించారు. అసలు తన శాఖలో పొంగులేటి జోక్యం ఏమిటని కొండా సురేఖ ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతకుముందే పొంగులేటి తీరుతో తనకు ఇబ్బందిగా ఉందని అధిష్టానంకు లేఖ రూపంలో కొండా సురేఖ భర్త, కాంగ్రెస్ నేత కొండా మురళి ఫిర్యాదు చేశారు. మంత్రి పొంగులేటి తీరుపై సీఎం రేవంత్ రెడ్డికి, పార్టీ అధిష్టానానికి కొండా సురేఖ ఫిర్యాదు చేశారు.

ఈ పరిణామాల నేపథ్యంలో.. మేడారం మహాజాతర సందర్భంగా ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి పనులపై క్షేత్రస్థాయిలో సమీక్షించేందుకు ఉమ్మడి వరంగల్ జిల్లా ఇంచార్జి మంత్రి పొంగులేటి, స్థానిక ఎమ్మెల్యే, మంత్రి సీతక్కలు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో హాజరు కావాల్సిన దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ గైర్హాజరయ్యారు. వాస్తవానికి దేవాదాయశాఖ పరిధిలో నిర్వహిస్తున్న పనులపై సమీక్షకు సంబంధిత శాఖ మంత్రి కొండా సురేఖ హాజరు కావాల్సి ఉంది. కానీ, ఆమె హాజరుకాలేదు. ఈ విషయంపై మీడియా ప్రశ్నించగా.. అత్యవసర పని ఉండడం వల్లే మేడారంలో నిర్వహించిన జాతర పనుల సమీక్షకు వెళ్లలేదని సురేఖ తెలిపారు. దీంతో ఈ వివాదం సమసిపోయిందని అనుకుంటున్న సమయంలో మేడారం అభివృద్ధి పనుల టెండర్లపై సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది.

పనుల నిర్వహణ మొత్తం బాధ్యతలను ఆర్‌అండ్‌బీకి అప్పగించింది. నిన్నటి వరకు దేవాదాయ, ఆర్ అండ్ బీ శాఖల పర్యవేక్షణలో మేడారంలో అభివృద్ధి పనులు జరుగుతుండేవి. ప్రస్తుతం మేడారం పనుల పర్యవేక్షణ బాధ్యతలను కేవలం ఆర్ అండ్ బీ శాఖకు మాత్రమే అప్పగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు దేవాదాయ శాఖకు సీఎస్ రామకృష్ణారావు ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటికే కొండా సురేఖ ఓఎస్డీని ప్రభుత్వం తప్పించింది.. మరుసటిరోజే మేడారం అభివృద్ధి పనుల పర్యవేక్షణ అంశంలో కొండా సురేఖకు ప్రభుత్వం బిగ్ షాకిచ్చింది.