Peddapalli: చంపొద్దని బతిమాలినా వదల్లేదు.. కూతుర్ని ప్రేమిస్తున్నాడని గొడ్డలితో కిరాతకంగా దాడి.. ఒక్కగానొక్క కొడుకు మృతితో..

తన కుమార్తెను వేరే కులం వ్యక్తి ప్రేమిస్తున్నాడని తెలుసుకొని యువతి తండ్రి కక్ష పెంచుకున్నాడు. యువకుడి పుట్టినరోజు నాడు గొడ్డలితో వెంటబడి హతమార్చాడు.

Peddapalli: చంపొద్దని బతిమాలినా వదల్లేదు.. కూతుర్ని ప్రేమిస్తున్నాడని గొడ్డలితో కిరాతకంగా దాడి.. ఒక్కగానొక్క కొడుకు మృతితో..

Saikumar

Updated On : March 29, 2025 / 12:03 PM IST

Peddapalli: తన కుతూర్ని ప్రేమిస్తున్నాడన్న కోపంతో యువకుడిపై యువతి తండ్రి కక్ష పెంచుకున్నాడు. తన కూతుర్ని మర్చిపోవాలని పలుసార్లు యువకుడ్ని హెచ్చరించాడు. మరోవైపు.. వేరేకులం యువకుడితో ప్రేమాగీమా వద్దంటూ కుమార్తెను మందలించాడు. అయినా వారు పట్టించుకోలేదు. తన పుట్టినరోజు నాడు యువకుడు యువతి చదువుతున్న హాస్టల్ వద్దకు వెళ్లి కలిసొచ్చాడు. ఈ విషయం తెలుసుకున్న యువతి తండ్రికి ఆగ్రహం కట్టలు తెంచుకుంది. రాత్రి సమయంలో స్నేహితులతో కలిసి పార్టీ చేసుకుంటున్న సమయంలో యువడిపై గొడ్డలితోదాడి చేశాడు. అప్రమత్తమైన యువకుడు అక్కడి నుంచి పారిపోగా వెంటబడి మరీ ఊళ్లోని బొడ్రాయి వద్ద యువడ్ని హత్య చేశాడు.

Also Read: Hyderabad: అమీన్పూర్లో చిన్నారుల మృతికేసు.. పెరుగన్నం తినడంవల్లే మృతిచెందారా..? పోలీసుల విచారణలో కీలక విషయాలు

పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండలం ముప్పిరితోట గ్రామంలో గురువారం రాత్రి జరిగిన ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. పోలీసుల కథనం ప్రకారం.. ముప్పిరితోటకు చెందిన సదయ్య కుమార్తె పెద్దపల్లిలో డిగ్రీ చదువుతోంది. చిన్నతనంలో తనతో కలిసి చదువుకున్న గ్రామానికి చెందిన పూరెళ్ల సాయికుమార్ (20)తో ఆమె కొన్నాళ్లుగా ప్రేమలో ఉంది. కులాలు వేరు కావడంతో వారి ప్రేమను మొదటి నుంచి సదయ్య వ్యతిరేకిస్తూ వచ్చాడు. కుమార్తెను ఓ ప్రైవేట్ హాస్టల్ లో ఉంచి చదివిస్తున్నాడు. అయితే, గురువారం సాయికుమార్ పుట్టినరోజు కావడంతో ప్రియురాలిని కలిసేందుకు బయలుదేరాడు. ఈ విషయం తెలిసిన సదయ్య బంధువును అక్కడికి పంపించి ఆరా తీశాడు. కుమార్తె హాస్టల్ లో లేదని, సాయికుమార్ తో బయటకు వెళ్లిందని తెలిసి సదయ్య కోపంతో రగిలిపోయాడు.

 

గురువారం రాత్రి సమయంలో గ్రామంలోని ఓ గుడి సమీపంలో స్నేహితులతో కలిసి సాయికుమార్ మద్యం సేవిస్తున్నాడు. ఈ విషయం తెలుసుకున్న సదయ్య గొడ్డలితో అక్కడికి వెళ్లి సాయికుమార్ పై దాడి చేయబోయాడు. అప్రమత్తమైన సాయికుమార్ అక్కడి నుంచి పారిపోయాడు. సదయ్య అతన్ని వెంబడించి గ్రామంలోని బొడ్రాయి ప్రాంతంలో గొడ్డలితో సాయికుమార్ ను నరికి చంపాడు. గ్రామస్తులు సదయ్యను పట్టుకొని పోలీసులకు అప్పగించారు.

 

సాయికుమార్ సోదరి గతంలో అనారోగ్య కారణాలతో మృతిచెందింది. ఒక్కొగానొక్క కొడుకు కూడా మృతిచెందడంతో అతని తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. పోలీసులు సదయ్యను అరెస్టు చేశారు. గ్రామంలో ఘర్షణలు తలెత్తకుండా పోలీస్ పికెట్ ఏర్పాటు చేశారు.