ప్రాణం తీసిన లోన్‌ యాప్‌..ఆన్‌లైన్‌ అప్పులకు యువతి బలి

ప్రాణం తీసిన లోన్‌ యాప్‌..ఆన్‌లైన్‌ అప్పులకు యువతి బలి

Updated On : December 18, 2020 / 12:28 PM IST

Young woman commits suicide : సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం రాజగోపాలపేటలో దారుణం జరిగింది. ఆన్‌లైన్‌ అప్పులకు యువతి బలయింది. మౌనిక .. ఖాతా క్లస్టర్‌ పరిధిలో ఏఈవోగా పనిచేస్తోంది. ఆమె తండ్రి వ్యాపార ప్రయత్నాల్లో నష్టపోవడంతో కుటుంబ అవసరాల కోసం మౌనిక స్నాప్‌ఇట్‌ లోన్‌ యాప్‌ నుంచి 3 లక్షల రుణం తీసుకుంది. అయితే గడువులోగా దాన్ని తిరిగి చెల్లించలేకపోవడంతో .. యాప్‌ నిర్వాహకులు మౌనిక అప్పుకట్టట్లేదంటూ.. ఆమె ఫోన్‌లోని కాంటాక్టు నంబర్లన్నింటికీ వాట్సప్‌ మెసేజ్‌లు పంపారు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన మౌనిక పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది.

మౌనిక ప్రభుత్వ వ్యవసాయ శాఖలో అధికారిగా విధులు నిర్వహిస్తోంది. ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు కూడా లేవు. కానీ… వ్యాపారం వాళ్ల తండ్రి భూపానిని ఆర్థికంగా దెబ్బతీసింది. కుటుంబ అవసరాలకు అమౌంట్ కావాల్సి వచ్చింది. తండ్రికి కష్టాలు పెరిగాయి. ఆయన కష్టాలు చూడలేకపోయిన మౌనిక… తప్పని పరిస్థితుల్లో… స్నాప్ ఇట్ లోన్ యాప్ నుంచి మూడు లక్షల రూపాయ రుణం తీసుకుంది. లోన్ ఇచ్చే ముందు కొంత గడువిచ్చింది స్నాప్ ఇట్ యాప్. తక్కువ ఇంట్రెస్ట్ అంటూ ఊదరగొట్టింది. ఆశపెట్టింది. అవసరాన్ని క్యాష్ చేసుకుంది.

లోన్ ఇచ్చిన తర్వాతే… అసలు రూపాన్ని ప్రదర్శించారు యాప్ నిర్వాహకులు. రుణ సంస్థ వేధింపులు, ఒత్తిడి ఎక్కువయ్యాయి. పైగా… యాప్‌ నిర్వాహకులు మౌనికను రుణం ఎగవేతదారుగా ప్రకటిస్తూ .. ఆమె ఫోన్‌లోని కాంటాక్టు నంబర్లన్నింటికీ వాట్సప్‌ మెసేజ్‌లు పంపారు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన మౌనిక .. ఇంట్లో పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. గమనించిన కుటుంబ సభ్యులు ఆమెను సికింద్రాబాద్‌ గాంధీ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందింది. ఆన్‌లైన్ యాప్ ఆగడాలు ఇప్పటివి కావు. ఇటీవల తరచూ ఇలాంటి సంఘటనలు ఎక్కడో ఒకచోట కనిపిస్తూనే ఉన్నాయి.

ఇంకా కొన్ని ప్రాంతాల్లో అయితే.. మూడు వేలు, ఐదు వేలు అప్పిచ్చే యాప్‌లు పుట్టుకొచ్చాయి. లోన్ ఇచ్చేప్పుడు ఉదారంగానే ఇచ్చినా… ఆ తర్వాతే లక్షలు తీసుకున్నారంటూ మానసికంగా వేధిపులకు పాల్పడుతున్నారు నిర్వాహకులు. ఇలాంటి వారి ఆగడాలకు చెక్ పెట్టాల్సిన అవసరం ఉంది. మరోవైపు ఈజీగా అప్పు పుడుతోందని ఎక్కడ పడితే అక్కడ లోన్‌‌లు తీసుకోవద్దంటున్నారు పోలీసులు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం, పోలీసులు చర్యలు చేపట్టాలని మృతురాలి బంధువులు కోరుతున్నారు. అయితే.. స్నాప్ ఇట్ లోన్ యాప్‌పై పూర్తి స్ధాయిలో విచారణ జరుపుతామంటున్నారు.