బంగ్లాదేశ్ సంచలనం.. కివీస్‌పై 150 పరుగుల తేడాతో భారీ విజయం

పటిష్టమైన న్యూజిలాండ్ జట్టును ఓడించి బంగ్లాదేశ్ సంచలన విజయం సాధించింది.

బంగ్లాదేశ్ సంచలనం.. కివీస్‌పై 150 పరుగుల తేడాతో భారీ విజయం

ban vs nz 1st test bangladesh historic win against new zealand

బంగ్లాదేశ్ క్రికెట్ జట్టు అద్భుతం చేసింది. న్యూజిలాండ్ జట్టును ఓడించి సంచలనం సృష్టించింది. కివీస్‌తో జరిగిన తొలి టెస్ట్ మ్యాచ్‌లో 150 పరుగుల భారీ తేడాతో విజయ కేతనం ఎగురవేసింది. బంగ్లాదేశ్ తమ సొంత గడ్డపై తొలిసారి న్యూజిలాండ్‌ను ఓడించి చరిత్ర లిఖించింది.

బంగ్లాదేశ్ లోని సిల్హెట్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో న్యూజిలాండ్ ఓటమి చవిచూసింది. 332 పరుగుల టార్గెట్ ఛేదించేందుకు బరిలోకి దిగిన కివీస్ 181 పరుగులకే ఆలౌటైంది. మ్యాచ్ ఐదో రోజు తొలి సెషన్ లోనే ఆట ముగిసింది. బంగ్లాదేశ్ స్పిన్నర్ తైజుల్ ఇస్లాం ధాటికి కివీస్ బ్యాటర్లు పెవిలియన్ కు క్యూ కట్టారు. తైజుల్ ఇస్లాం 6 వికెట్లు పడగొట్టి కివీస్ పతనాన్ని శాసించాడు.

ఆట చివరి రోజు 113/7 స్కోరుతో ఆట ప్రారంభించిన న్యూజిలాండ్ మరో 68 పరుగులు మాత్రమే జోడించి ఆలౌటయింది. డారిల్ మిచెల్(58) మినహా ఎవరూ రాణించకపోవడంతో కివీస్ కు ఓటమి తప్పలేదు. టిమ్ సౌథీ 34, డెవాన్ కాన్వే 22, ఇష్ సోధి 22, గ్లెన్ ఫిలిప్స్ 12, విలియమ్సన్ 11 పరుగులు చేశారు. బంగ్లాదేశ్ బౌలర్లలో తైజుల్ ఇస్లాం 6, నయీం హసన్ 2 వికెట్లు పడగొట్టారు.

తొలి ఇన్నింగ్స్ లో బంగ్లాదేశ్ 310, కివీస్ 317 పరుగులు చేశాయి. రెండో ఇన్నింగ్స్ లో బంగ్లాదేశ్ 338 పరుగులు సాధించింది. తైజుల్ ఇస్లాం తొలి ఇన్నింగ్స్ లో 4 వికెట్లు తీశాడు. మొత్తం 10 వికెట్లు పడగొట్టి బంగ్లాదేశ్ విజయంలో కీలకపాత్ర పోషించాడు. అతడే ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా ఎంపికయ్యాడు.

Also Read: ఆస్ట్రేలియాలో పాకిస్తాన్ ఆట‌గాళ్ల‌కు ఘోర అవ‌మానం..! వీడియో