Kishan Reddy: భయపెడితే భయపడనీకి నేను కేసీఆర్ అనుకున్నావా?.. సీఎం రేవంత్ కు కిషన్ రెడ్డి కౌంటర్
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తనపై చేసిన విమర్శలకు కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి (Kishan Reddy)సాలిడ్ కౌంటర్ ఇచ్చారు.
BJP State President kishan reddy counter attack on cm revanth reddy
- రేవంత్ సవాల్‌కు కిషన్‌రెడ్డి ఘాటు కౌంటర్.
- రాహుల్ గాంధీ ప్రధాని కాలేరు: కిషన్‌రెడ్డి.
- కాంగ్రెస్ గ్యారెంటీల అమలులో ఘోర వైఫల్యం.
Kishan Reddy: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తనపై చేసిన విమర్శలకు కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి(Kishan Reddy) అత్యంత ఘాటుగా కౌంటర్ ఇచ్చారు. తెలంగాణ రాజకీయాల్లో పెను దుమారం రేపుతున్న ఈ సవాల్ ప్రతిసవాళ్ల పర్వంలో కిషన్ రెడ్డి ఎక్కడా తగ్గకుండా సీఎంపై విరుచుకుపడ్డారు. తాను రేవంత్ రెడ్డిలా పదే పదే పార్టీలు మారిన వ్యక్తిని కాదని, తన నిజాయితీకి ఆయన ఇచ్చే సర్టిఫికెట్ అవసరం లేదని స్పష్టం చేశారు. నన్ను పొలిమేర దాటకుండా ఆపే మొనగాడు ఇంకా ఎవరూ పుట్టలేదని, కాంగ్రెస్ నాయకులు ఎంత రెచ్చగొట్టినా తాను రెచ్చిపోయే వ్యక్తిని కాదని, మీ తాటాకు చప్పుళ్లకు భయపడటానికి ఇక్కడ ఉన్నది కేసీఆర్ కాదని కిషన్ రెడ్డి హెచ్చరించారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి ముందుంది ముసళ్ల పండుగ అని, సీఎం రేవంత్ రెడ్డికి ఇంకా ఎంతో కాలం లేదని, కేవలం మరో రెండున్నరేళ్లు మాత్రమే ఈ పదవి ఉంటుందని ఆయన జోస్యం చెప్పారు. ఇచ్చిన హామీలను నెరవేర్చకపోవడంతో త్వరలోనే దళితులు, బీసీలు వచ్చి కాంగ్రెస్ నాయకుల ఇళ్ల ముందు ధర్నాలు చేస్తారని, అలాగే తన ఇంటి ముందు ధర్నా చేస్తానన్నా తాను దేనికైనా సిద్ధమేనని సవాలు విసిరారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రస్తుతం తీవ్రమైన రాజకీయ నిరాశ, నిస్పృహల్లో ఉన్నారని, అందుకే ఆయన నోటి నుంచి వచ్చే మాటలు కొండలు, కోనలు దాటుతున్నా, ఆయన ఇచ్చిన హామీలు మాత్రం సెక్రటేరియేట్ గేటు కూడా దాటడం లేదని ఎద్దేవా చేశారు.
రైతులకు ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా ఈ ప్రభుత్వం అమలు చేయడం లేదని కిషన్ రెడ్డి ఆరోపించారు. రాష్ట్రంలో ఎక్కడా ఐదు వందల రూపాయల బోనస్ ఇవ్వడం లేదని, కేవలం సన్న వడ్లకే కాకుండా దొడ్డు వడ్లకు సైతం బోనస్ చెల్లించడంలో కాంగ్రెస్ సర్కార్ ఘోరంగా విఫలమైందని మండిపడ్డారు. కాంగ్రెస్ ఇచ్చిన ఏ ఒక్క గ్యారెంటీని సరిగ్గా అమలు చేయడం లేదని, ఏ చర్చకైనా తాను సిద్ధమని ప్రకటిస్తూ, రాసి పెట్టుకోండి ఈ జన్మలో రాహుల్ గాంధీ దేశానికి ప్రధాని కాలేరంటూ కిషన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.
