నిన్న ఆర్జీవీ.. ఇప్పుడు పోసాని, శ్రీరెడ్డి.. అరెస్టుల పర్వంలో నెక్ట్స్‌ జరగబోయేదేంటి?

హైకోర్టు తీర్పు.. ఏపీ పోలీసులకు మరింత బలంగా మారింది.

నిన్న ఆర్జీవీ.. ఇప్పుడు పోసాని, శ్రీరెడ్డి.. అరెస్టుల పర్వంలో నెక్ట్స్‌ జరగబోయేదేంటి?

Updated On : November 14, 2024 / 9:16 PM IST

సోషల్‌మీడియా దారుణాలు చెక్‌పెట్టాలని ఫిక్స్ అయిన ఏపీ పోలీసులు.. దూకుడు ఏంటో చూపిస్తున్నారు. నోరు జారినవాళ్లు.. సోషల్‌మీడియాలో హద్దులు దాటినవాళ్ల లెక్కలు తీసి.. లెక్క తేల్చేందుకు ఖాకీలు ఫోకస్‌ పెట్టారు. ఇది ఇప్పుడు కొత్త టర్న్‌ తీసుకుంది. వైసీపీ మద్దతుదారులుగా పేరు సినిమా పర్సనాలిటీస్‌ను టార్గెట్‌ చేస్తున్నారు. ఆర్జీవీకి నోటీసులు వెళ్లాయ్. ఇప్పుడు పోసాని, శ్రీరెడ్డి వంతు వచ్చింది. ఈ ఇద్దరి అరెస్ట్ ఖాయమా.. జైలు ఊచలు లెక్కించాల్సిందేనా..

సోషల్‌ మీడియా అరెస్ట్‌లు, నోటీసుల వ్యవహారం.. ఇప్పుడు ఏపీ రాజకీయాలను షేక్ చేస్తోంది. మండలిలోనూ మంటలు పుట్టించిందంటే.. పాలిటిక్స్ ఏ రేంజ్‌లో నిప్పులు కక్కుతున్నాయో అర్థం చేసుకోవచ్చు. సోషల్‌మీడియాలో హద్దులు దాటి.. బూతుపురాణాలు చదివిన వందల మందికి ఇప్పటికే పోలీసులు నోటీసులు పంపించారు.

కొందరిని అదుపులోకి..
కొందరిని అదుపులోకి తీసుకున్నారు కూడా ! ఐతే వైసీపీ మద్దతుదారులుగా ఉంటూ.. చంద్రబాబు, లోకేశ్‌ పవన్ కల్యాణ్ టార్గెట్‌గా అనుచిత వ్యాఖ్యలు, పోస్టులు చేసిన సినిమా పర్సనాలిటీస్‌కు చుక్కలు చూపించే పనిలో ఉంది కూటమి సర్కార్. ఆర్జీవీపై ప్రకాశం జిల్లా మద్దిపాడులో కేసు నమోదుకాగా.. హైదరాబాద్ వెళ్లి మరీ నోటీసులు ఇచ్చారు. ఇప్పుడు పోసాని, శ్రీరెడ్డి వంతు కనిపిస్తోంది. ఈ ఇద్దరిపై ఇప్పటికే చాలాచోట్ల కేసులు నమోదయ్యాయ్. దీంతో ఈ ఇద్దరి అరెస్ట్ తప్పదా అనే చర్చ మొదలైంది.

సినీ నటుడు, వైసీపీ నేత పోసాని కృష్ణమురళిపై గుంటూరు జిల్లా పట్టాభిపురం పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదయింది. టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడును అవమానించేలా తీవ్ర వ్యాఖ్యలు చేశారని తెలుగు యువత ఉపాధ్యక్షుడు ఫిర్యాదు చేశారు. పోసాని వ్యాఖ్యలతో కోట్లాది మంది భక్తులు మనోభావాలు దెబ్బతిన్నాయని ఫిర్యాదు చేశారు. విజయవాడలో పోసానిపై జనసైనికులు ఫిర్యాదు చేశారు.

వైసీపీ హయాంలో.. పవన్ కల్యాణ్, ఆయన కుటుంబ సభ్యులపై అనుచిత వ్యాఖ్యలు చేశారని.. గతంలో ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోలేదని.. ఇప్పటికైనా చర్యలు తీసుకోవాలని కోరారు. అటు నటి శ్రీరెడ్డికి షాక్‌ల మీద షాక్‌లు తగులుతున్నాయ్. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌.. మంత్రులు లోకేశ్‌, అనితను దుర్భాషలాడుతూ సోషల్‌ మీడియాలో పోస్టులు పెట్టిన శ్రీరెడ్డిపై… చర్యలు తీసుకోవాలని కోరుతూ విశాఖపట్నం కంచరపాలెం, అనంతపురం, రాజమహేంద్రవరం రూరల్‌ మండలం బొమ్మూరుతో పాటు.. గుడివాడ పీఎస్‌లోనూ కేసు నమోదయింది.

ఈ ఇద్దరి అరెస్ట్ ఖాయం
పోసాని, శ్రీరెడ్డికి నోటీసులు ఇచ్చేందుకు పోలీసులు రెడీ అవుతున్నారు. ఐతే ఈ ఇద్దరి అరెస్ట్ ఖాయం అనే ప్రచారం జరుగుతోంది. ముందుగా ఇద్దరిని విచారణకు పిలిచి.. ఆ తర్వాత పోలీసులు చర్యలు తీసుకునే అవకాశం ఉంది. అరెస్ట్ ప్రమాదాన్ని ముందు గుర్తించిన శ్రీరెడ్డి.. కొద్దిరోజులుగా లోకేష్, పవన్ కళ్యాణ్‌కు క్షమాపణ చెబుతూ వీడియోలు పోస్ట్ చేసింది.

అయినా ఆమెపై కేసు నమోదైంది. దీంతో ఇప్పుడు లోకేశ్‌కు శ్రీరెడ్డి ఓపెన్ లెటర్ రాసింది. తనని రక్షించాలి అంటూ వేడుకుంటోంది. దీనిపై కూటమి సర్కార్‌ పెద్దల రియాక్షన్ ఎలా ఉంటుందన్నది ఆసక్తి రేపుతోంది. ఏమైనా అటు పోసాని, ఇటు శ్రీరెడ్డి.. త్వరలో జైలు ఊచలు లెక్కించడం ఖాయం అనే గుసగుసలు వినిపిస్తున్నాయ్.

హైకోర్టు తీర్పు.. ఏపీ పోలీసులకు మరింత బలంగా మారింది. సోషల్‌మీడియాలో అసభ్యపదజాలంతో దూషించిన వారినికి నోటీసులు ఇవ్వడంలో తప్పేంటని.. బాధితుల్లో జడ్జిలు కూడా ఉన్నారని.. ఏపీ హైకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. హైకోర్టు తీర్పుతో.. ఇప్పుడు ఏపీ పోలీసులు మరింత దూకుడు చూపించే అవకాశం ఉంది. దీంతో సోషల్‌మీడియాలో హద్దులు దాటి ఓవరాక్షన్ చేసి.. దరిద్రపు పోస్టులు పెట్టిన వారంతా.. ఇప్పుడు రివ్యూ చేసుకోవడం మొదలుపెట్టారట. ఇప్పుడు పోసాని, శ్రీరెడ్డి.. మరి రేపు ఎవరు.. పోలీసుల వలలో చిక్కుకునేది ఎవరు అనే చర్చ.. ఏపీ రాజకీయాల్లో హాట్‌టాపిక్‌గా మారింది.

కాంగ్రెస్ సర్కార్‌కు ఎందుకు టార్గెట్ అయ్యారు? కేటీఆర్‌తో 10టీవీ ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూ..