RBI కీలక నిర్ణయం…బంగారం విలువలో 90శాతం వరకూ రుణం

  • Published By: venkaiahnaidu ,Published On : August 6, 2020 / 05:30 PM IST
RBI కీలక నిర్ణయం…బంగారం విలువలో 90శాతం వరకూ రుణం

Updated On : August 7, 2020 / 9:09 AM IST

రిజర్వు బ్యాంకు అఫ్ ఇండియా(RBI) కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా కష్టకాలంలో కుటుంబాలకు ఆసరాగా నిలిచేందుకు బంగారం విలువపై బ్యాంకులు, బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు ఇచ్చే రుణ మొత్తాన్ని 75 శాతం నుంచి 90 శాతానికి పెంచుతూ ఆర్‌బీఐ గురువారం కీలక నిర్ణయం తీసుకుంది. వచ్చే ఏడాది మార్చి వరకూ ఈ సడలింపు అందుబాటులో ఉంటుంది.



ప్రస్తుత మార్గదర్శకాల ప్రకారం బ్యాంకులు… బంగారు ఆభరణాల తనఖాపై ఇచ్చే వ్యవసాయేతర రుణాలకు బంగారం విలువలో 75 శాతం మించకుండా రుణాలు జారీ చేస్తున్నాయి. కుటుంబ ఆదాయాలపై కరోనా సంక్షోభం తీవ్ర ప్రభావం చూపుతున్న తరుణంలో ఈ తరహా రుణాలకు loan-to-value ratio- రుణ విలువ నిష్పత్తి (ఎల్‌టీవీ) 90 శాతం వరకూ పెంచాలని నిర్ణయించామని ఆర్‌బీఐ గవర్నర్‌ శక్తికాంత్‌ దాస్‌ ప్రకటించారు.

ఎల్‌టీవీ పెంపుతో బ్యాంకులు బంగారు ఆభరణాలపై అధిక మొత్తంలో రుణాలు ఇచ్చేందుకు వెసులుబాటు కలిగింది. గోల్డ్‌ లోన్‌లు జారీ చేసే బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీలకు ఈ నిర్ణయం సానుకూల పరిణామమని విశ్లేషకులు పేర్కొంటున్నారు. తాజా మార్గదర్శకాల ప్రకారం గతంలో​ 5 లక్షల రూపాయల విలువైన బంగారంపై 3.75 లక్షల రూపాయల రుణం లభిస్తే ఇప్పుడు అదే విలువ కలిగిన బంగారం తనఖాపై 4.5 లక్షల రూపాలయ వరకూ రుణం పొందవచ్చు. అయితే బంగారం విలువలో అధిక మొత్తం రుణంగా పొందితే వడ్డీ భారం కూడా అదేస్ధాయిలో పెరుగుతుందనేది గమనార్హం.



కాగా, RBI గవర్నర్‌ శక్తికాంతదాస్‌ అధ్యక్షతన మూడు రోజులపాటు సమావేశమైన మానిటరీ పాలసీ కమిటీ(ఎంపీసీ) కీలక రేట్లను యథాతథంగా కొనసాగించేందుకే నిర్ణయించింది. దీంతో వడ్డీ రేట్లకు కీలకమైన రెపో రేటు 4 శాతంవద్దే కొనసాగనుంది.