Narumadi Preparation : వరి నారుమడి తయారీ, యాజమాన్య పద్ధతులు!

నారుమడిలో కలుపు నివారణకు ఎకరా నారుమడికి బ్యూటాకోర్‌ లేదా బెందియోకారబు 2 లీటర్ల మందును 200 లీటర్ల నీటితో కలిపి విత్తిన 8వ రోజున మడిలో నీటిని తీసివేసి పిచికారీ చేసుకోవాలి.

Narumadi Preparation : వరి నారుమడి తయారీ, యాజమాన్య పద్ధతులు!

Rice Narumadi Preparation, Proprietary Methods!

Updated On : November 16, 2022 / 6:31 PM IST

Narumadi Preparation : వరి సాగులో నారుమడి యాజమాన్యం చాలా కీలకం. మడి తయారు చేసుకోవడం, విత్తనశుద్ధి, తెగుళ్ల నివారణ జాగ్రత్తలు తీసుకుంటే నారు ఆరోగ్యంగా పెరుగుతుంది. నారు మడి పెంపకంపై రైతులు పూర్తి స్థాయిలో అవగాహన కలిగి ఉండాలి. వరి నారు మడి వేయాలనుకుంటే ముందుగా వేసవికాలంలోనే లోతు దుక్కులు చేసుకోవాలి. నారుమడి ఆఖరి దుక్కిలో చివికిన పశువుల పెంటను 2 నుండి 3 టన్నులు వేయాలన్నారు. నారుమడిని 12 రోజుల వ్యవధిలో మూడు దఫాలు దమ్ము చేసి చదును చేయాలి. నారుమడి లో నీటిని పెట్టేందుకు, నారుమడి నుంచి నీటిని బయటకు పంపించేందుకు కాలువలు ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది.

దొడ్డు రకాలయితే ఎకరానికి 25కిలోలు, సన్న రకాలైతే 20 కిలోల విత్తనం సరిపోతుంది. మెట్ట నారుమళ్లకు కిలో విత్తనానికి 3గ్రాములు కార్బండిజమ్‌ను తడితో పట్టించి ఆరబెట్టి మడిలో చల్లుకోవాలి. దమ్ము చేసిన నారుమడులు అయితే లీటరు నీటికి 1గ్రా. కార్బండిజమ్‌ కలిపిన ద్రావణంలో 24 గంటలు విత్తనాలను నానబెట్టి ఆ తరువాత మండెకట్టి మొలకలను నారుమడిలో చల్లుకోవాలి. తక్కువ నిద్రావస్థ విత్తనాలకైతే లీటరు నీటికి 63మి.లీ, ఎక్కువ నిద్రావస్థ విత్తనాలకైతే 10మి.లీ గాఢ నత్రికామ్లం కలిపి, ఆ ద్రావణంలో 24 గంటలు నానబెట్టి కడిగి మండె కట్టాలి.

5 సెంట్ల నారుమడికి విత్తనం చల్లే ముందు1 కిలో, పన్నెండు రోజుల తర్వాత మరో కిలో నత్రజని వేయాలి. ఒక కిలో భాస్వరం, ఒక కిలో పటాస్‌ నిచ్చే ఎరువులను దుక్కిలో వేయాలన్నారు. శిలీంధ్ర నాశిని తో విత్తన శుద్ధి చేయాలి. ఒక ఎకరా వరి సాగుకు సంబంధించి 5 సెంట్ల భూమిలో 25 కిలోల వరి విత్తనాల నారు పెంచాలి. నారుమడిలో ఒక ఆకు పూర్తిగా పురి విచ్చుకునే వరకు ఆరు తడులు ఇచ్చి, తర్వాత పలుచగా నీరు నిల్వ కట్టాలి.

జింకు లోప నివారణకు లీటరు నీటికి 2గ్రా. జింకు సల్ఫేట్‌ కలిపి పిచికారి చేయాలి. మెట్ట నారుమడిలో ఇనుపధాతు లోపాన్ని గమనిస్తే మొక్క వయసును అనుసరించి అన్నభేది 0.5నుంచి 1గ్రా. నిమ్మ ఉప్పు లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి. నారు తీసే ఏడు రోజుల ముందు గుంట నారుమడి(2.5 సెంట్లకు) 400గ్రా. కార్బోఫ్యూరాన్‌ 3జీ గుళికలు ఇసుకతో కలిపి చల్లి పలుచగా నీరు ఉంచాలి.

నారుమడిలో కలుపు నివారణకు ఎకరా నారుమడికి బ్యూటాకోర్‌ లేదా బెందియోకారబు 2 లీటర్ల మందును 200 లీటర్ల నీటితో కలిపి విత్తిన 8వ రోజున మడిలో నీటిని తీసివేసి పిచికారీ చేసుకోవాలి. నారు మళ్ళలో ఉల్లికోడు, కాండం తొలిచే పురుగు, తామర పురుగులు ఆశించి నష్టం కలగ చేయకుండా సెంటు నారుమడి లో10 వ రోజు, 17 వ రోజు క్లోరిపైరీపాస్‌ 2 మిల్లీ లీటర్లు లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి. నారు తీయడానికి 7 రోజుల ముందు 160 గ్రాములు కార్బోప్యూరాన్‌ గుళికలు ఇసుకలో కలిపి పల్చగా నారుమడిలో చల్లుకోవాలి.