నిధుల సేకరణ ఎలా? ఏపీని ఏ రకంగా అభివృద్ధి చేస్తారు? చంద్రబాబు ముందు అతిపెద్ద సవాల్

ఈ ప్రభుత్వం అందరిదీ అనే నమ్మకం కల్పించారు. ఇక ఎన్నికల హామీలు అమలు చేస్తూ.. సంక్షేమ పథకాలు కొనసాగిస్తూ.. నవ్యాంధ్రకు చంద్రబాబు సరికొత్త చరిత్ర ఎలా లిఖిస్తారన్నది చూడాల్సి ఉంది.

నిధుల సేకరణ ఎలా? ఏపీని ఏ రకంగా అభివృద్ధి చేస్తారు? చంద్రబాబు ముందు అతిపెద్ద సవాల్

Chandrababu Challenges : గతంలో మూడుసార్లు ముఖ్యమంత్రి అయినప్పటికీ చంద్రబాబు 4.0పై ఇంతకుముందు ఎన్నడూ లేనట్టుగా ఇప్పడు అందరి దృష్టి నెలకొంది. విభజన జరిగిన పదేళ్ల తర్వాత కూడా రాజధాని నిర్మించుకోలేకపోయిన రాష్ట్రంగా ఉన్న ఆంధ్రప్రదేశ్‌ను చంద్రబాబు ఏ రకంగా అభివృద్ధి చేస్తారన్నది ఆసక్తిగా మారింది. అతిరథ మహారథుల మధ్య ప్రమాణస్వీకారం చేసిన చంద్రబాబు… నవ్యాంధ్రను నవశకంలోకి నడిపిస్తారని ప్రజలు నమ్ముతున్నారు.

కేంద్రంలోనూ కీలక శక్తిగా మారడంతో.. పాలనను పరుగులు పెట్టించి దేశంలో ఆంధ్రప్రదేశ్‌ను అగ్రభాగాన నిలబెట్టగల సత్తా చంద్రబాబుకుందని భావిస్తున్నారు. అయితే మ్యానిఫెస్టోలో చెప్పినట్టు సూపర్ సిక్స్ అమలు చేస్తూ లోటు బడ్జెట్ రాష్ట్రాన్ని గాడిన పెట్డడానికి చంద్రబాబు చాలా శ్రమపడాల్సి వస్తుందన్న అభిప్రాయం నెలకొంది.

కొత్త చంద్రబాబును చూస్తారు..
సంక్షోభాలను ఎదుర్కోవడం, వాటి నుంచి అవకాశాలను సృష్టించుకుని అద్భుతాలు సృష్టించడం చంద్రబాబుకు కొత్త కాదు. నవ్యాంధ్రప్రదేశ్‌కు రెండోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన చంద్రబాబు.. తన పాలనా అనుభవంతో గతంలోలానే నవ్యాంధ్ర నడక, నడతను తీర్చిదిద్దాలని రాష్ట్ర ప్రజలు కోరుకుంటున్నారు. ప్రజాపాలన కొనసాగిస్తామని, ప్రతి అడుగు ప్రజల కోసమే వేస్తామని చంద్రబాబు చెబుతున్నారు. తాను మారిన మనిషినని, కొత్త చంద్రబాబును చూస్తారని.. ఎన్నికల్లో గెలిచిన దగ్గరి నుంచి చంద్రబాబు అంటున్నారు. సంక్షేమ పథకాల అమలులో వెనక్కితగ్గబోమని చెప్పడమే చంద్రబాబు ఉద్దేశం కావొచ్చు. రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ప్రజలు ఇచ్చిన తీర్పును నిలబెట్టుకుని, గౌరవించే బాధ్యత తనకుందని సీఎం అన్నారు.

నిధుల సేకరణ అతిపెద్ద సవాల్..
అమరావతిని రాష్ట్ర రాజధానిగా తీర్చిదిద్దుతామని చంద్రబాబు స్పష్టం చేశారు. ఇప్పటికే అమరావతిలో పనులు ఊపందుకున్నాయి. సగంలో ఆగిపోయిన భవనాల నిర్మాణాలు మొదలవుతున్నాయి. అమరావతి అంతటా రాజధాని హడావిడి కనిపిస్తోంది. విశాఖను ఆర్థిక రాజధానిగా మారుస్తామన్న చంద్రబాబు అందరూ కలిసి నవ్యాంధ్ర పునర్‌ నిర్మాణం కోసం పనిచేయాలని కోరారు. విభజన బాధిత రాష్ట్రంగా ఉన్న ఆంధ్రప్రదేశ్‌ను గాడిన పెట్టడానికి.. భారీగా పెట్టుబడులు కావాలి. పారిశ్రామిక వేత్తలకు రాష్ట్రంపై నమ్మకం కలిగించాలి. రాజధాని నిర్మాణాన్ని నిరంతరాయంగా కొనసాగిస్తూనే.. ఇచ్చిన మాట తప్పకుండా సూపర్‌ సిక్స్ సంక్షేమ పథకాలను చెప్పినట్టుగా అమలు చేయాలి. పోలవరం పూర్తి చేయాల్సి ఉంది. అయితే వీటన్నింటికీ నిధుల సేకరణ చంద్రబాబుకు అతిపెద్ద సవాల్‌గా మారనుంది.

జాతీయ స్థాయిలోనూ కింగ్ మేకర్..
చంద్రబాబు నాలుగు దశాబ్దాల రాజకీయ అనుభవం, అభివృద్ధిపై అవగాహన, పెట్టుబడులు తెచ్చే సమర్థత, జాతీయ, అంతర్జాతీయ సంస్థలు ఏపీ వైపు చూడగలిగేలా చేసేలా నైపుణ్యం నవ్యాంధ్రకు కొత్త చరిత్ర రాస్తాయన్న అభిప్రాయం నెలకొంది. జనసేన, బీజేపీకి క్యాబినెట్‌లో చోటు కల్పించిన చంద్రబాబు కూటమిగా కలిసి పని చేస్తామన్న సంకేతాలు అందించారు. ఐదేళ్లగా గడ్డుకాలం ఎదుర్కొన్న టీడీపీకి, చంద్రబాబుకు ఇప్పుడు పరిస్థితులన్నీ అనుకూలంగా మారాయి. ఆంధ్రప్రదేశ్‌లో ఘనవిజయం సాధించడంతో పాటు జాతీయ స్థాయిలోనూ చంద్రబాబు కింగ్ మేకర్ అయ్యారు.

ఎన్డీఏ ప్రభుత్వం పయనం సాఫీగా సాగాలంటే ఏపీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు రాష్ట్రానికి కోరేవన్నీ అందించాల్సిన పరిస్థితి కేంద్రానిది. 1998, 1999లో కేంద్రంలో కింగ్‌మేకర్‌గా ఉన్నప్పటికీ, ఇప్పటికీ చంద్రబాబుకు బలం తగ్గినప్పటికీ.. ప్రస్తుతం టీడీపీకి ఉన్న 16 మంది ఎంపీల సంఖ్య ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో చిన్న విషయం కాదు. అందుకే బడ్జెట్ కేటాయింపుల్లోనూ, పరిశ్రమల ఏర్పాటులోనూ, నిధుల మంజూరులోనూ, పోలవరం, రాజధాని నిర్మాణాలకు సహకారం అందించడంలోనూ కేంద్రం నుంచి ఆశించినట్టుగానే ఏపీకి, చంద్రబాబుకు సహకారం అందే అవకాశం ఉంది.

రాష్ట్రానికి కావాల్సినవి సాధించుకునే వ్యూహంలో తొలి విజయం..
ఎన్నికలకు ముందు టీడీపీ, జనసేన, బీజేపీతో పొత్తు విషయంలో చంద్రబాబు ఎంత వ్యూహాత్మకంగా వ్యవహరించారో… ఎన్నికల్లో గెలిచి…కేంద్రంలో బీజేపీ తర్వాత అతి పెద్ద పార్టీగా నిలిచిన తర్వాత కూడా అంతే తెలివిగా అడుగులు వేశారు. ఎన్డీఏలోనే కొనసాగడం ద్వారా రాష్ట్రానికి కావాల్సినవి సాధించుకునే వ్యూహంలో తొలి విజయం సాధించారు. ప్రమాణస్వీకారానికి మోదీ సహా బీజేపీ పెద్దలు హాజరుకావడంతో చంద్రబాబుకు, టీడీపీకి కేంద్రం ఎంత విలువ ఇస్తోందో దేశానికి అర్ధమయింది. రాష్ట్రంలో వీలైనంత వేగంగా అనుకూల పరిస్థితులు సృష్టించి.. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పెట్టుబడులు ఆకర్షించడానికి మార్గం సుగమమయింది.

ఈ ప్రభుత్వం అందరిదీ అనే నమ్మకం కల్పించారు..
అలాగే రాష్ట్ర మంత్రివర్గ కూర్పలోనూ చంద్రబాబు సామాజిక సమీకరణాలకు పెద్ద పీట వేశారు. ఈ ప్రభుత్వం అందరిదీ అనే నమ్మకం కల్పించారు. ఇక ఎన్నికల హామీలు అమలు చేస్తూ.. సంక్షేమ పథకాలు కొనసాగిస్తూ.. నవ్యాంధ్రకు చంద్రబాబు సరికొత్త చరిత్ర ఎలా లిఖిస్తారన్నది చూడాల్సి ఉంది.

Also Read : హోంమంత్రి ఎవరు, ఆర్థిక శాఖ ఎవరికి? పవన్‌కు ఇచ్చే పదవి ఏది? మంత్రులకు కేటాయించే శాఖలపై ఉత్కంఠ