హుజూర్ నగర్ ఉప ఎన్నికల బరిలో 28 మంది అభ్యర్థులు

  • Published By: veegamteam ,Published On : October 3, 2019 / 10:18 AM IST
హుజూర్ నగర్ ఉప ఎన్నికల బరిలో 28 మంది అభ్యర్థులు

Updated On : October 3, 2019 / 10:18 AM IST

హుజూర్ నగర్ ఉప ఎన్నికల కోలాహలం మొదలైంది. ఉప ఎన్నికల బరిలో 28 మంది అభ్యర్థులు ఉన్నారు. మొత్తం 76 నామినేషన్లు దాఖలు కాగా, వీటిలో 45 నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయి. గురువారం (అక్టోబర్ 3, 2019)  మరో ముగ్గురు నామినేషన్లు ఉపసంహరించుకున్నారు. హుజూర్ నగర్ కు చెందిన కొప్పుల ప్రతాప్ రెడ్డి, నల్లగొండ జిల్లా కట్టంగూరుకు చెందిన రేకల సైదులు, వరంగల్ రూరల్ జిల్లా నెక్కొండకు చెందిన గుంగులోతు శేఖర్ తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. 
ఇవాళే ఉపసంహరణకు చివరి రోజు.

నామినేషన్ దాఖలుకు కూడా గడువు ముగిసింది. దీంతో మొత్తం 28 మంది అభ్యర్థులు బరిలో ఉన్నట్లు అధికారులు ప్రకటించారు. వీటికి సంబంధించి పేర్లను నోటీసు బోర్టులో పెట్టారు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని ఆటో, ట్రక్కు గుర్తులను డిలిట్ చేస్తూ నోటీసు బోర్డులో ఉంచారు. గుర్తులను కూడా కొద్ది సేపట్లో ప్రకటించే అవకాశం ఉంది. మొత్తం 70 నుంచి 80 గుర్తులను డిస్ ప్లే చేశారు.  వీటిలో రోడ్డు రోలర్ గుర్తు  కూడా ఉంది. దీంతో ఆ గుర్తు ఎవరికైనా వచ్చే అవకాశం ఉంది. 13 మంది వివిధ పార్టీలకు చెందిన అభ్యర్థులు ఉండగా, మిగిలిన 15 మంది స్వతంత్ర అభ్యర్థులుగా బరిలో ఉన్నారు.

సీపీఐ.. టీఆర్ఎస్ కు మద్దతు ఇచ్చింది. టీజేఎస్.. కాంగ్రెస్ కు మద్దతు ప్రకటించింది. టీడీపీ, బీజేపీ ఒంటరిగా బరిలోకి దిగాయి. టీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్యే ప్రధాన పోటీ నెలకొంది. కంచుకోట లాంటి చోట కమ్యూనిస్టులు ఉనికిలో లేకుండా పోయారు. ఉప ఎన్నికల్లో సీపీఐ ఇప్పటికే టీఆర్ఎస్ కు మద్దతు ప్రకటించింది. సీపీఎం అభ్యర్థి శేఖర్ రావు నామినేషన్ ను రిటర్నింగ్ అధికారి తిరస్కరించారు. దీంతో బై పోల్ లో కామ్రేడ్లు పోటీకి దూరమయ్యారు. ఇది జిల్లాలో రాజకీయంగా పెద్ద ఎత్తున చర్చనీయాంశమైంది.

బై ఎలక్షన్ లో టీడీపీ.. సీపీఎం మద్దతు కోరింది. తమకు మద్దతు ఇవ్వాలంటూ సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రంతో టీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ ఫోన్ లో మాట్లాడారు. అయితే పార్టీలో చర్చించి నిర్ణయం చెబుతామని తమ్మినేని వీరభద్రం చెప్పారు. కాగా సీపీఎం అభ్యర్థి నామినేషన్ తిరస్కరణపై తమ్మినేని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయంపై న్యాయ పోరాటం చేస్తామన్నారు. 

మరోవైపు ఉప ఎన్నికలో కాంగ్రెస్ కు మద్దతివ్వాలని టీజేఎస్ నిర్ణయం తీసుకుంది. అయితే కాంగ్రెస్ కు బయటి నుంచి మద్దతిస్తామని, వారితో కలిసి ప్రచారం చేయబోమని టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం స్పష్టం చేశారు. టీఆర్ఎస్ పాలనకు చరమ గీతం పాడాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా పోరాడతామన్నారు. టీఆర్ఎస్ కు సీపీఐ మద్దతు ఇవ్వడం చారిత్రక తప్పిదమని విమర్శించారు.

(అక్టోబర్ 21, 2019)వ తేదీన హుజూర్ నగర్ ఉప ఎన్నికలు జరుగనున్నాయి. (అక్టోబర్ 24, 2019)వ తేదీన ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. రాజకీయ పార్టీలు ఎవరికివారే గెలుస్తామనే ధీమాలో ఉన్నారు. ఉప ఎన్నికపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.