పక్కాప్లాన్: ప్రేమించి, పెళ్లి చేసుకుని చంపేశాడు

ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఇష్టపడి పెళ్లి చేసుకున్న వ్యక్తి కంటికి రెప్పలా చూసుకుంటాడు అని భావించిన యువతికి భర్తే కాల యముడు అయ్యాడు. వివరాల్లోకి వెళ్తే.. అనంతపురం నగరశివారులోని సుశీలరెడ్డి కాలనీకి చెందిన సరోజ(28), రాప్తాడు మండలం ప్రసన్నాయపల్లికి చెందిన జగదీశ్వరరెడ్డి ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. కులాల అడ్డు గోడలను కూల్చి ఇద్దరూ 9నెలల క్రితం పెళ్లి చేసుకున్నారు. అయితే పెళ్లి చేసుకున్న తర్వాత వీరిద్దరి మధ్య తరచూ చిన్న చిన్న మనస్పర్ధలు చోటుచేసుకోవడంతో గొడవలు పడుతూ వచ్చారు. కానీ చిన్న చిన్న గొడవలను పెద్దవిగా తీసుకున్న జగదీశ్వరరెడ్డి పక్కా ప్లాన్ ప్రకారం భార్యను చంపాలని అనుకున్నాడు.
ఈ క్రమంలో యాక్సిడెంట్‌గా చిత్రీకరించి భార్యను చంపేయాలని భావించిన జగదీశ్వరరెడ్డి బైక్‌పై భార్యను ఎక్కించుకుని శుక్రవారం తెల్లవారుజామున 4 గంటల సమయంలో రొడ్డుపై కింద పడేశాడు. కిందపడిన తర్వాత ఆమె తలపై బలంగా కొట్టి జగదీశ్వరరెడ్డి కిరాతకంగా సరోజను చంపేశాడు. అనంతరం జగదీశ్వరరెడ్డి 108 వాహనంలో అనంతపురం ఆస్పత్రికి చికిత్స చేయించుకునేందుకు వెళ్లాడు. లారీ ఢీ కొట్టడంతో భార్య చనిపోయిందని పోలీసులకు చెప్పాడు. అయితే అనుమానం వచ్చిన పోలీసులు జగదీశ్వరరెడ్డిని గట్టిగా విచారించడంతో అసలు విషయం బయటకు వచ్చింది. మృతురాలి తండ్రి ప్రభుదాస్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించారు.