ఏడేళ్ల పాటు దాచిన వీర్యంతో పేరెంట్స్ అయ్యారు

ముందు జాగ్రత్త బాగా పనిచేసింది.. ఏడేళ్ల క్రితం ఇరువురు దంపతులు దాచుకున్న స్పెర్మ్.. వారికి ముద్దుల సంతానాన్ని ప్రసాదించింది. క్యాన్సర్ ట్రీట్‌మెంట్‌కు వెళ్లే ముందు వైద్యుల సలహా మేరకు వీర్యాన్ని స్పెర్మ్ బ్యాంకులో భద్రపరుచుకున్నాడు. దాన్ని ఇంట్రాసైటోప్లాస్మిక్ స్పెర్మ్ ఇంజక్షన్ ద్వారా వినియోగించి తల్లిదండ్రులయ్యారు.
2012లో 23 ఏళ్ల వ్యక్తికి పెళ్లి అయిన కొద్ది రోజులకే తీవ్ర అనారోగ్యానికి గురయ్యాడు. ఛాతీ, ఊపిరితిత్తుల మధ్య మెడియాస్టినల్ ట్యూమర్ క్యాన్సర్‌తో బాధపడుతున్నట్లుగా వైద్యులు గుర్తించారు. పెళ్లైన కొద్ది రోజుల్లోనే ఇలా జరగడంతో ఆ దంపతులు తీవ్ర మనోవేదనకు గురయ్యారు. చికిత్సలో ఎదురయ్యే దుష్ప్రభావాలను దృష్టిలో పెట్టుకుని.. అతడి వీర్యాన్ని స్పెర్మ్ బ్యాంకులో భద్రపరుచుకోవాలని వైద్యుడు సూచించారు.
2012లో క్యాన్సర్ చికిత్స ప్రారంభానికి ముందు కార్తీక్ తన వీర్యాన్ని ఒయాసిస్ ఫెర్టిలిటీ బ్యాంకులో భద్రపరిచాడు. సంవత్సరం క్రితం పూర్తిగా కోలుకున్నాడు. ట్రీట్‌మెంట్‌లో భాగంగా జరిగిన కిమోథెరపీ, రేడియోథెరపీల కారణంగా తండ్రి అయ్యే సామర్థ్యాన్ని కోల్పోయాడు. ఈ క్రమంలో భద్రపరిచిన వీర్యం ద్వారా సంతానం పొందాలని నిర్ణయించుకున్న ఆ దంపతులు.. ఒయాసిస్ ఫెర్టిలిటీని సంప్రదించారు.
ఐసీఎస్‌ఐను మాగ్నెటిక్ యాక్టివేటెడ్ సెల్ సార్టింగ్ వంటి లేటెస్ట్ టెక్నాలజీ ఉపయోగించి 2019లో పిండాన్ని తయారుచేసి.. మహిళ గర్భాశయంలోకి ప్రవేశపెట్టారు. అలా మహిళ గత వారం పండంటి ఆడ శిశువుకు జన్మనిచ్చింది. ఇటీవలే ఆస్పత్రి నుంచి పూర్తి ఆరోగ్యవంతంగా తల్లిబిడ్డలు ఇంటికి చేరుకున్నారు.