ప్రణయ్ హత్య కేసులో మారుతీ రావు మళ్లీ అరెస్ట్

నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో సంచలనం సృష్టించిన ప్రణయ్ హత్యకేసులో ప్రధాన నిందితుడు, అమృత తండ్రి మారుతీరావు మళ్లీ అరెస్ట్ అయ్యాడు. వరంగల్ సెంట్రల్ జైలులో ఉండి బెయిల్‌పై బయటకొచ్చిన మారుతీ రావు.. తమ కుమారుడి హత్య కేసులో రాజీ కుదుర్చుకోవాలంటూ తమపై బెదిరింపులకు పాల్పడుతున్నాడంటూ ప్రణయ్ తండ్రి బాలస్వామి పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఈ క్రమంలోనే మారుతీరావు తన అనుచరులను ప్రణయ్ ఇంటికి పంపి భయబ్రాంతులకు గురి చేసినట్లు ప్రణయ్ కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలోనే అమృత కూడా కేసు నమోదు చేయడంతో పోలీసులు మారుతీరావును అరెస్ట్ చేసినట్లు తెలుస్తుంది.
కూతురు కులాంతర వివాహం చేసుకోవడం సహించలేని మారుతీరావు మిర్యాలగూడలో ప్రణయ్ అనే యువకుడిని అతి దారుణంగా కత్తితో నరికి నడి రోడ్డుపై హత్య చేయించాడు. ప్రణయ్, అమృతలు 2018 జనవరి 31న ప్రేమ వివాహం చేసుకోగా సెప్టెంబర్‌లో రియల్ ఎస్టేట్ వ్యాపారి అయిన మారుతీ రావు హత్య చేయించారు. ఈ కేసులో మారుతీరావు ఏ1గా, అతని తమ్ముడు శ్రవణ్ ఏ2గా ఉన్నారు.