చూపు తిప్పుకోలేం : అమరావతి బిల్డింగ్స్ పై హీరోయిన్ల బొమ్మలు

ఏపీ రాజధాని అమరాతి చుట్టుపక్కల ప్రాంతాల్లో ఇప్పుడు కొత్త ట్రెండ్. అందమైన హీరోయిన్ల ఫొటోలను దిష్ఠి బొమ్మలుగా వాడేస్తున్నారు ఆ ప్రాంత ప్రజలు. ఇది కొత్త ట్రెండ్ ఏమిటి? ఇలాంటివి ఇంతకు ముందు చాలానే చూశాం.. సన్నిలియోన్, అనుష్క వంటి హీరోయిన్ల ఫొటోలతో ఉన్న దిష్ఠిబొమ్మలను పంట పొలాల్లో ఉంచడం చాలా రోజుల నుంచి ఉంది కదా.. ఇప్పుడేంటి ఈ కొత్త అని ఆశ్యర్యపోతున్నారా? అవునండీ ఏపీ రాజధానిగా అమరావతిని ప్రకటించడంతో ఆ ప్రాంతంలోని భూ ధరలు అమాంతం పెరిగిపోయాయి. చేతి నిండా.. దండిగా డబ్బులు వచ్చి పడటంతో విపరీతంగా బిల్డింగులు లేస్తున్నాయి. గతంలో ఎక్కడన్నా కొత్త నిర్మాణాలు సాగేవి.. ఇప్పుడు ఎక్కడ చూసినా భారీ భవన కట్టడాలే. దీంతో దిష్టితగులుతుందని బాధపడుతున్నారు యజమానులు. ఇతరుల చూపు భవనంపై పడకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అందుకు వినూత్నంగా ఆలోచించారు.
అమరావతి చుట్టుపక్కల గ్రామాలన్నింటిలోనూ నిర్మాణంలో ఉన్న బిల్డింగ్ లకు టాలీవుడ్, కోలీవుడ్, మాలీవుడ్, శాండిల్ వుడ్, హాలీవుడ్ అన్న తేడాలేకుండా అందమైన హీరోయిన్ల పోస్టర్లను తగిలిస్తున్నారు. హెబ్బా పటేల్, అనుష్క శెట్టి, అనుష్క శర్మ, పాయల్ రాజ్ పుత్, శృతిహాసన్, సమంత, రమ్య, నివేధ థామస్, కీర్తి సురేష్, రష్మిక, శిల్పా శెట్టి, అమీషా పటేల్, రాశి ఖన్నా, కాజల్ అగర్వాల్ వంటి అందమైన హీరోయిన్ల హాట్ పోస్టర్లను నిర్మాణంలో ఉన్న బిల్డింగ్ లకు దిష్టిబొమ్మలుగా తగిలిస్తున్నారు.
బిల్డింగ్ నుంచి ప్రజల అటెన్షన్ డైవర్ట్ చేయడానికే ఇలా చేస్తున్నామని స్థానికులు చెబుతున్నారు. బిల్డింగ్ చూసిన ఎవరైనా ఈ హీరోయిన్ల పోస్టర్లు చూసి వాళ్ల గురించి ఆలోచిస్తుంటారని, ఆ సమయంలో బిల్డింగ్ గురించి వాళ్లు మనసులో కూడా అనుకోరని మరో స్థానికుడు అంటున్నారు. గతంలో పొలాల్లో ఇలాంటి చూసేవారం.. ఇప్పుడు ఏపీ రాజధానిలోని భవనాలకు అందమైన హీరోయిన్ల ఫొటోలు, బ్యానర్లు దిష్టిగా వచ్చాయి.