ఎథిక్స్ కమిటీ ఛైర్మన్‌గా అంబటి రాంబాబు

  • Published By: vamsi ,Published On : November 8, 2019 / 01:24 AM IST
ఎథిక్స్ కమిటీ ఛైర్మన్‌గా అంబటి రాంబాబు

Updated On : November 8, 2019 / 1:24 AM IST

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి సంబంధించిన  ఐదు కమిటీలను ప్రకటించారు ప్రభుత్వం. స్పీకర్ తమ్మినేని సీతారాం చైర్మన్‌గా రూల్స్ కమిటీ ఏర్పాటవగా.. అందులో అంబటి రాంబాబుకు కీలక పదవి లభించింది.  రూల్స్ కమిటీలో సీతారాంతోపాటు ఆరుగురు ఎమ్మెల్యేలు సభ్యులుగా ఉంటారు.

డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి చైర్మన్‌గా పిటీషన్స్ కమిటీ ఏర్పాటైంది. అందులో కూడా ఆరుగురు సభ్యులకు అవకాశం ఉంది. నెల్లూరు జిల్లాకు చెందిన కాకాణి గోవర్ధన్ రెడ్డి చైర్మన్‌గా ప్రివిలేజ్ కమిటీ ఏర్పాటైంది. అందులో కూడా ఆరుగురు సభ్యులు ఉంటారు. కొట్టు సత్యనారాయణ చైర్మన్‌గా ప్రభుత్వ హామీల కమిటీ ఏర్పాటైంది.

ఇక అంబటి రాంబాబు చైర్మన్‌గా ఎథిక్స్ కమిటీ ఏర్పాటైంది. ఎథిక్స్ కమిటీలో టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ప్రతిపక్షం నుంచి సభ్యునిగా నియమితులు అయ్యారు. అసెంబ్లీలో అధికార విపక్షాలు సభ్యతగా వ్యవహరించాలి. అయితే, కొన్ని సందర్భాల్లో రెండు పార్టీల నేతలు నోటికి పదును పెడుతుంటారు. ఈ క్రమంలో మాటలు హద్దులు దాటుతుంటాయి.

ఇలాంటి సందర్భాలు ఎదురైనప్పుడు నైతిక విలువల కమిటీ వాటిని పరిశీలిస్తుంది. వైసీపీ అధికార ప్రతినిధిగా ఉన్న అంబటి రాంబాబు విపక్షాల విమర్శలను ఎప్పటికప్పుడు తిప్పుకొడుతున్నారు. అందుకే ఆయనను ఈ కీలకమైన పదవిలో పెట్టినట్లు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.

సామాజిక సమీకరణాల నేపథ్యంలో అంబటికి మంత్రి పదవి దక్కలేదు. ఈ క్రమంలో ప్రభుత్వంలో కీలక పదవి లభిస్తుందని భావించిన ఆయనను ఎథిక్స్ కమిటీ ఛైర్మన్‌గా చేసింది ప్రభుత్వం.