అమరావతి రైతుల ఆందోళన : 144 సెక్షన్‌ను కూడా లెక్క చేయకుండా నిరసనలు

ఓ వైపు టెన్షన్ వాతావరణం, అయినా వెనక్కి తగ్గని పట్టుదలల మధ్య అమరావతి రాజధాని రైతుల నిరసనలు కొనసాగించారు. పోలీసులు విధించిన 144 సెక్షన్‌ను కూడా లెక్క చేయకుండా తుళ్లూరులో మహాధర్నాలు, మందడంలో కవాతులతో తమ నిరసన గళాన్ని బలంగా వినిపించారు.
అమరావతి రాజధాని కోసం రైతులు చేస్తున్న నిరసనలు రోజురోజుకు ఉధృతమవుతున్నాయి. తుళ్లూరులో రైతుల మహాధర్నాలో రైతులు, కూలీలు పాల్గొన్నారు. పోలీసులు విధించిన 144 సెక్షన్‌ను కూడా లెక్క చేయకుండా నిరసనలు కొనసాగించారు. మా భూములిచ్చాం రోడ్డున పడ్డామంటూ నినాదాలు చేశారు.
తుళ్లూరులో హై టెన్షన్ వాతావరణం ఏర్పడింది. రాజధాని కోసం ఆందోళన చేస్తున్న రైతుల్లో ఓ అన్నదాత ఆత్మహత్యకు ప్రయత్నించడం కలకలం రేపింది. ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకోవడానికి యత్నించడంతో… పోలీసులు అలర్ట్ అయ్యి రైతును అడ్డుకున్నారు.
ఇటు మందడంలోనూ ఉద్రిక్తత తలెత్తింది. కవాతు నిర్వహించేందుకు రైతులు ప్రయత్నిచండంతో టెన్షన్ వాతావరణం చోటు చేసుకుంది. 144సెక్షన్ అమలులో ఉండడంతో రైతుల కవాతును పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులు, రైతుల మధ్య ఘర్షణ జరిగింది. పలువురు రైతులకు తీవ్రంగా గాయాలయ్యాయి. రమణమ్మ అనే మహిళా రైతును పోలీసులు తోసేయడంతో..ఆమె చేతికి గాయమైంది.
మరోవైపు అమరావతిలో రాజధానిని కొనసాగించాలని డిమాండ్ చేస్తూ జేఏసీ చేస్తున్న దీక్షకు మద్దతుగా.. అనంతపురం బీసీ సంఘం నేతలు గుంటూరులో దీక్ష చేపట్టారు. 24 గంటల పాటు సాగిన రిలే నిరాహార దీక్షను నిమ్మరసం ఇచ్చి టీడీపీ నేతలు గల్లా జయదేవ్, ప్రత్తిపాటి పుల్లారావు విరమింపజేశారు .