దేశంలో ఏ రాష్ట్రం ఏపీలా దగా పడలేదు : సీఎం జగన్
ఏపీ రాష్ట్రం దగా పడిందని ఏపీ సీఎం జగన్ అన్నారు. తెలుగు రాష్ట్రాలు విడిపోతాయని ఎప్పుడూ ఊహించలేదన్నారు.

ఏపీ రాష్ట్రం దగా పడిందని ఏపీ సీఎం జగన్ అన్నారు. తెలుగు రాష్ట్రాలు విడిపోతాయని ఎప్పుడూ ఊహించలేదన్నారు.
ఏపీ రాష్ట్రం దగా పడిందని ఏపీ సీఎం జగన్ అన్నారు. తెలుగు రాష్ట్రాలు విడిపోతాయని ఎప్పుడూ ఊహించలేదన్నారు. ఏపీలోని 13 జిల్లాల ప్రజల శ్రమ చెన్నై, హైదరాబాద్ లో మిగిలిపోయిందని తెలిపారు. ఎక్కడా వెనకడుగు వేయకుండా ముందుకు వెళ్తున్నామని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. మూడు రోజుల పాటు వేడుకలు జరుగనున్నాయి. రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా శుక్రవారం (నవంబర్ 1, 2019) విజయవాడ ఐజీఎంసీ స్టేడియంలో నిర్వహించిన ఉత్సవాల్లో సీఎం జగన్ తోపాటు గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ పాల్గొన్నారు. పొట్టి శ్రీరాములు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. స్వాతంత్ర్య సమరయోధుల కుటుంబ సభ్యులను సత్కరించారు.
ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ అమరజీవి పొట్టి శ్రీరాములు త్యాగాన్ని స్మరించుకోవాలన్నారు. పొట్టి శ్రీరాములు, కన్నెగంటి హనుమంతు, దామోదర సంజీవయ్య, కడప కోటిరెడ్డి మహనీయులతోపాటు మహా కవులు, కళాకారులు, సాహితీవేత్తలు, విద్యావేత్తలు, సంఘ సంస్కకర్తలు, ప్రసిద్ధ పాత్రికేయుల త్యాగాలు, భావాలు మన సమాజానికి గొప్ప పునాదులు అన్నారు. ఐదేళ్ల తర్వాత రాష్ట్ర అవతరణ దినోత్సవం జరుపుకుంటున్నామని చెప్పారు.
అనేక పరిణామాల తర్వాత 1956 నుంచి 2014 వరకు ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నామని తెలిపారు. మళ్లీ 2019లో మిగిలిపోయిన ఆంధ్రప్రదేశ్ అనే పేరుతో వేరుగా మనం ప్రయాణాన్ని ప్రారంభించామని తెలిపారు. 1953లో ఆంధ్రరాష్ట్రం ఏర్పడినప్పుడు, 1956లో ఆంధ్రప్రదేశ్ అవతరించినప్పుడు, 2009 సెప్టెంబర్ వరకు వైఎస్ రాజశేఖర్ రెడ్డి జీవించి ఉన్నంత వరకు కూడా మనం ఊహించని పరిణామాలు, మనతరం ఎప్పుడూ చూడని పరిణామాలు ఇప్పుడు చూస్తున్నామని చెప్పారు. తెలుగు రాష్ట్రాలు విడిపోతాయని ఎప్పుడు కూడా ఊహించలేదన్నారు. ఏపీలోని 13 జిల్లాల ప్రజలు చేసిన శ్రమ, పరిశ్రమంతా కూడా చెన్నై, హైదరాబాద్ లోనే మిగిలిపోయిందన్నారు.
29 రాష్ట్రాల భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్రం పడని దగా పరిస్థితుల్లో ఏపీ ఉందన్నారు. అయినా ఎక్కడా ధైర్యం కోల్పోలేదన్నారు. వెనకడుగు వేయలేదని, వెన్నుచూపలేదన్నారు. అభివృద్ధి తప్ప మరో మార్గం లేదు.. కాబట్టి పదేళ్లుగా దెబ్బతిన్న సామాజిక, ఆర్థిక, పునర్నిర్మిస్తున్నామని చెప్పారు. నిరు పేద కుటుంబం, రోజు కూలీ కుటుంబం, దిగువ, మధ్య తరగతి కుటుంబాన్ని దృష్టిలో పెట్టుకొని, ఎప్పటికప్పుడు వారి అవసరాలు తీర్చడంతోపాటు వారి తర్వాతి తరం కూడా సగర్వంగా ఎదిగేందుకు కావాల్సిన ప్రణాళికలతో నవరత్నాల పాలనతో అడుగులు ముందుకు వేస్తున్నామని చెప్పారు.
విద్య, వైద్యం, వ్యవసాయ రంగాల రూపురేఖలను మార్చబోతూ నవరత్నాలను తీసుకురాగలిగామని చెప్పారు. నవ్యాంధ్రప్రదేశ్ లో ఈ కార్యక్రమాన్ని జరుపుకుంటున్నామని సగర్వంగా చెప్పగల్గుతున్నామని తెలిపారు. మనం గొప్ప కార్యక్రమాన్ని జరుపుకుంటున్నామని, అందరం మర్చిపోకూడని అంశం ఒకటుందన్నారు. రాష్ట్ర అవతరణ ఎందరో గొప్ప వ్యక్తులు చేసిన త్యాగ ఫలం అన్నారు. ఈరోజు అన్ని రకాలుగా మనం ఇబ్బందుల పడుతున్నా మనందరికీ ఈ కష్టాల తర్వాత మంచిరోజులు కూడా వస్తాయన్నారు.
మనమంతా కష్టపడాలని, కలిసి కట్టుగా ఒక్కటిగా ఉండాలని గుర్తు చేసుకునే సందర్భం ఇది అన్నారు. ఈ రోజును ఎప్పటికీ కూడా గుర్తు పెట్టుకుంటామని, మహానీయులు నేర్పిన స్ఫూర్తిని ఎప్పటికీ మర్చిపోమన్నారు. ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధిలో అందరూ కలిసి కట్టుగా అడుగులు వేయాలని పిలుపు నిచ్చారు. దేవుడు ఆశీర్వదించాలని, మీ అందరి చల్లని దీవెనలతో ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధిలో పరుగులు పెట్టాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.