ఏపీలో పొత్తులు చిత్తు : ఆ 4 పార్టీల మధ్య యుద్ధం

హైదరాబాద్ : బాహుబలి యుద్ధాన్ని తెరపైనే చూశాం.. అలాంటి యుద్ధమే రియల్ గా చూడాలంటే ఏపీ ఎన్నికలకు వెళ్లాల్సిందే. పొత్తులు గిత్తులు ఏమీ లేవు.. సింగిల్ గా వస్తున్నాను అంటూ జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రకటనతో ఏపీ పాలిటిక్స్ ఒక్కసారిగా భగ్గుమన్నాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ – జనసేన పొత్తు చర్చలు అని.. టీడీపీ – జనసేన పొత్తు అంటూ వార్తలు, లీకులు వచ్చాయి. ఎవరు ఎలా ఉన్నా జనసేన కార్యకర్తలు మాత్రం కన్ఫ్యూజ్ లోకి వెళ్లారు. దీన్ని గుర్తించిన పవన్ సార్.. వెంటనే రంగంలోకి దిగారు. జనసేన ఒంటరి పోరాటం అంటూ స్వయంగా ప్రకటించి.. ఏపీ ఎన్నికల కురుక్షేత్రంలో రాజకీయ యుద్ధానికి శంఖారావం పూరించారు.
టీడీపీది ఒంటరి బాటే
జనసేన పవన్ కల్యాణ్ ప్రకటనతో ఏపీలో టీడీపీది ఒంటరి పోరాటం అని క్లారిటీ వచ్చేసింది. వారం రోజులుగా పవన్ తో కలిస్తే మీకెంటి నొప్పి అంటూ చంద్రబాబు మాట్లాడుతూ వచ్చారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ – జనసేన మళ్లీ కలిసి పోటీ చేస్తాయా అనే డౌట్ అందరిలో వచ్చింది. అలాంటిది ఏమీ లేదని పవన్ చెప్పటంతో.. ఒక టీడీపీ కూడా సింగిల్ గా బరిలోకి దిగబోతున్నది. కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకున్నా.. ఆ పార్టీ యాక్టివ్ గా లేదు. బీజేపీతో ఎటూ వెళ్లలేని పరిస్థితి. ఎందుకంటే ఆరు నెలలుగా బీజేపీపైనే యుద్ధం చేస్తున్నారు బాబు.సో.. టీడీపీ ఒంటరిగా బరిలోకి దిగటం ఖాయం అయిపోయింది.
బీజేపీని వద్దంటున్న ఆల్ పార్టీస్
బీజేపీ విషయానికి ముందునుయ్యి.. వెనక గొయ్యి. ప్రత్యేక హోదా అంశం కీలకం కావటం, అది ఇచ్చేది లేదని తెగేసి చెప్పటంతో మిత్రపక్షం టీడీపీనే ఛీకొట్టింది. ప్రజల్లో సెంటిమెంట్ ఉన్న ఇలాంటి పరిస్థితుల్లో పోయిపోయి వైఎస్ఆర్ కాంగ్రెస్, జనసేన కూడా పొత్తు పెట్టుకునే అవకాశాలు లేవు. బీజేపీ స్నేహహస్తం ఇస్తామన్నా.. దగ్గరకు తీసుకునే పార్టీనే లేకపోవటంతో ఆ పార్టీకి మింగుడు పడటం లేదు. ఉన్న కొద్దోగొప్పో ఓట్లను కూడా ప్రభుత్వ వ్యతిరేకత అన్న కోణంలో మిగతా పార్టీలు లాగేసుకుంటున్నాయి. ఇప్పటికే ఏపీ బీజేపీ నుంచి ఎంతో మంది నేతలు ఇతర పార్టీల్లోకి జంప్ అయ్యారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ విధిలేని పరిస్థితుల్లో ఒంటరిగా బరిలోకి దిగుతుంది. సేమ్ టూ సేమ్ తెలంగాణలో ఎలా ఉందో అలాగే ఇప్పుడు ఏపీలోనూ ఉంది.
వైఎస్ఆర్ కాంగ్రెస్ ది ఒంటరి పోరాటమే
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీది ఒంటరి పోరాటం. 2014 ఎన్నికల తరహాలోనే మళ్లీ అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నరు జగన్. జనసేనతో పొత్తు చర్చలు జరిగాయని.. పవన్ – జగన్ కలిసి పోటీ చేస్తారని ప్రచారం జోరుగా సాగినా.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచే సానుకూల సంకేతాలు రాలేదనేది స్పష్టంగా తెలుస్తోంది. గత ఎన్నికల్లో బాబు, మోడీ, పవన్ కలిసి పోటీ చేశారు. ఇప్పుడు వాళ్లందరూ విడివిడిగా బరిలోకి దిగుతున్నారు. అంటే గత ఎన్నికల్లో వన్ టూ వన్ ఫైట్ చేసిన జగన్.. ఈసారి వన్ టూ ఫోర్ ఫైటింగ్ కు రెడీ అయ్యారు. ఓట్ల చీల్చుడుతో ఈసారైనా గట్టెక్కుతాడో లేదో వచ్చే ఎన్నికలే చెప్పాలి.
జనసేనకి ప్లస్సా.. మైనస్సా
పార్టీ పుట్టి చాలా కాలం అయినా.. జస్ట్ రీసెంట్ గానే ఎన్నికల గుర్తు తెచ్చుకున్నది జనసేన. తెలంగాణ ఎన్నికలకు దూరంగా ఉంది. ఏపీలో మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ తో జతకట్టి ముందుకెళ్లాలని భావించినా.. ఎందుకో ఏమో ప్రయత్నం విఫలం అయినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే సింగిల్ గా పోటీ చేస్తా.. అది కూడా 175 స్థానాల్లోనూ అంటూ ప్రకటించిన సంచలనం రేపారు పవన్. అన్ని స్థానాల్లో పోటీ చేసే సత్తా, దమ్ము ఆ పార్టీకి ఉన్నా.. గెలిచేది ఎవరు.. ఎంత మంది అనేది ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది. బలమైన స్థానాల్లో మాత్రమే పోటీ చేస్తాం అంటూ చెప్పుకుంటూ వచ్చిన పవన్ కల్యాణ్.. ఇప్పుడు 175 సీట్లలోనూ దిగుతా అంటున్నారు అంటే.. ఏ పార్టీ ఓట్లు చీలబోతున్నాయి.. ఏ పార్టీని గెలిపించబోతున్నారు.. ఎవరిని ఓడించబోతున్నారు అనే లెక్కల లెక్కింపులో బీజీ అయ్యాయి ఆ పార్టీస్…
Read More : జనసేన సంచలనం : 175 సీట్లలో ఒంటరిగా పోటీ