సింగరేణిలో మరో మూడు కొత్త గనులు : బొగ్గు ఉత్పత్తిపై ఫోకస్

అదనపు ఉత్పత్తి, ఉపాధి కల్పన లక్ష్యంగా మరో మూడు బొగ్గు గనులను ప్రారంభించేందుకు సింగరేణి యాజమాన్యం సిద్ధమైంది.

  • Published By: veegamteam ,Published On : February 14, 2019 / 02:43 PM IST
సింగరేణిలో మరో మూడు కొత్త గనులు : బొగ్గు ఉత్పత్తిపై ఫోకస్

అదనపు ఉత్పత్తి, ఉపాధి కల్పన లక్ష్యంగా మరో మూడు బొగ్గు గనులను ప్రారంభించేందుకు సింగరేణి యాజమాన్యం సిద్ధమైంది.

భద్రాద్రి కొత్తగూడెం : అదనపు ఉత్పత్తి, ఉపాధి కల్పన లక్ష్యంగా మరో మూడు బొగ్గు గనులను ప్రారంభించేందుకు సింగరేణి యాజమాన్యం సిద్ధమైంది. కొత్తగూడెం ఏరియాలో  రెండు, ఇల్లందు ప్రాంతంలో మరో గనిని అందుబాటులోకి తీసుకురావాలని సర్కార్ నిర్ణయించింది. వచ్చే రెండేళ్లలో గనుల్లో బొగ్గు తవ్వకాలు ప్రారంభించే విధంగా ప్రణాళిలకు సిద్ధం చేసింది.  

సిరుల గని సింగరేణి బొగ్గు ఉత్పత్తి పెంచుకోవడంపై దృష్టి పెట్టింది. సంస్థ కొత్తగా ప్రారంభించనున్న మూడు బొగ్గు గనుల్లో రెండు ఉపరితల గనులు కాగా, మరొకటి భూగర్భగని. కొత్తగూడెం, ఇల్లందు ప్రాంతాల్లో వీటిని ప్రారంభించేందుకు చురుగ్గా సన్నాహాలు జరుగుతున్నాయి. ఉమ్మడి ఖమ్మం జిల్లా సత్తుపల్లి సమీపంలోని కిష్టారం.. టేకులపల్లి మండలం కోయగూడెం వద్ద ఉపరితల గనులు, కొత్తగూడెం ప్రాంతంలోని రాంపురంలో భూగర్భ గనిని కొత్తగా ప్రారంభించనున్నారు.

కిష్టారం ఉపరితల గనిలో బొగ్గు తవ్వకాల కోసం సింగరేణి 400 కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టనుంది. రాంపురం గనికి 431.92 కోట్ల రూపాయలు, కోయగూడెం గనికి 426.79 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది. కిష్టారం ఉపరితల గనిలో 21.61 మిలియన్‌ టన్నుల బొగ్గు నిల్వలు ఉన్నట్టు లెక్క తేల్చారు. ప్రారంభించిన  తర్వాత పన్నెండేళ్ల వరకు బొగ్గు వెలికితీయొచ్చని అంచనా వేశారు. కోయగూడెం ఉపరితల గనిలో 136.8 మిలియన్‌ టన్నుల బొగ్గు నిల్వలు ఉన్నట్లు నిర్థారించారు. ఈ గనిలో 38 సంవత్సరాల పాటు బొగ్గును తవ్వుకోవచ్చని తేల్చారు. రాంపురం భూగర్భ గనిలో 43.40 మిలియన్‌ టన్నుల బొగ్గు నిల్వలు ఉన్నాయి. ఈ గనిలో  31 సంవత్సరాల పాటు బొగ్గు తవ్వకాలు చేపట్టవచ్చని అంచనా వేశారు.  కొత్త గనుల ప్రారంభంతో ఈ ప్రాంతంలో వెయ్యి నుంచి రెండు వేల మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని భావిస్తున్నారు. సాధ్యమైనంత త్వరగా కొత్త గనులు ప్రారంభించి, ఉపాధి కల్పించాలని స్థానికులు కోరతున్నారు.