ఏపీ ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ : 2 లక్షల కోట్లు దాటనున్న బడ్జెట్

విజయవాడ : ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలోని టీడీపీ ప్రభుత్వ పదవీకాలం జూన్ మాసం నాటికి ముగుస్తుంది. మార్చి – ఏప్రిల్‌లో ఎన్నికలు జరిగే అవకాశముంది. దీంతో ఓట్ ఆన్ అకౌంట్‌ను రూపొందించాల్సి ఉంది. ఇందుకోసం ప్రభుత్వం ఓట్ ఆన్ అకౌంట్‌పై దృష్టి సారించింది. ప్రభుత్వ ఆదేశాలతో అధికార యంత్రాంగం బడ్జెట్ రూపొందించే పనిలో పడింది. ఫిబ్రవరి 15 నాటికి బడ్జెట్ తయారు చేయాలని ఆర్థికశాఖ లక్ష్యంగా పెట్టుకుంది.
ప్రజాకర్షక బడ్జెట్‌గా తీర్చిదిద్దుతున్న ఏపీ ప్రభుత్వం
గత ఏడాది లక్షా 93వేల కోట్లతో బడ్జెట్
ఈసారి రెండు లక్షలు దాటనున్న బడ్జెట్
శాఖలవారీగా బడ్జెట్ ప్రతిపాదనలు తెప్పించుకుంటోన్న ఆర్థికశాఖ
ఎన్నికల ముందు వచ్చే చివరి బడ్జెట్ కానుండడంతో టీడీపీ ప్రభుత్వం ప్రజలను ఆకర్షించే బడ్జెట్‌గా రూపొందించనుంది. గత బడ్జెట్ లక్షా 93వేల కోట్ల రూపాయలతో ప్రభుత్వం ప్రవేశపెట్టింది. అయితే ఈసారి రెండు లక్షల కోట్ల రూపాయలపైగా బడ్జెట్‌ను ప్రవేశపెట్టే అవకాశముంది. ఇందుకు సంబంధించి ఏ శాఖ నుంచి ఎంత బడ్జెట్ డిమాండ్ ఉందో వివరాలను ఆర్థికశాఖ తెప్పించుకుంటోంది. ఆయా శాఖల ప్రధాన్యతల ప్రకారం ఓట్ ఆన్ అకౌంట్ రూపొందిస్తున్నారు. ప్రతి ప్రభుత్వ శాఖకకు శాఖకు ఒక నమూనాను ఆర్థిక శాఖ ఇచ్చింది. దాని ప్రకారం ప్రతిపాదనలను సమర్పిపంచాలని ఆదేశించింది. ఈ నమూనాలో గత ఏడాది ఎంత కేటాయించారు…. ఈ ఏడాది ఎంత అవసరం అవుతుందన్న వివరాలు అందిస్తున్నారు. వీటికి సంబంధించి ఆర్థికశాఖ మంత్రి యనమల రామక్రిష్ణుడు, ఆర్థికశాఖ అధికారులు ఆయా శాఖల అధికారులతో సమీక్షలు చేస్తున్నారు. ఫిబ్రవరి 15కల్లా పూర్తి స్థాయి బడ్జెట్ స్వరూపంతో సిద్ధంగా ఉండాలని ఆర్థికశాఖ భావిస్తోంది. ఏటా 5శాతం నిర్వహణ వ్యయం పెరుగుతున్నందున ఈ ఏడాది బడ్జెట్ రెండు లక్షలు కోట్లు దాటే అవకాశముంది.