భారీ బందోబస్తు : విశాఖకు ఇద్దరు సీఎంలు

  • Published By: madhu ,Published On : February 14, 2019 / 12:45 AM IST
భారీ బందోబస్తు : విశాఖకు ఇద్దరు సీఎంలు

Updated On : February 14, 2019 / 12:45 AM IST

విశాఖపట్టణం : పట్టణంలో ఇద్దరు సీఎంలు పర్యటించనున్నారు. ఏపీ సీఎం చంద్రబాబు పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేయనుండగా.. యూపీ సీఎం ఆదిత్యనాథ్‌ యోగి శారదాపీఠంలో జరగనున్న కార్యక్రమానికి హాజరుకానున్నారు. ఇద్దరు ప్రముఖుల పర్యటన నేపథ్యంలో… పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. విశాఖ శ్రీ శారదాపీఠంలో స్వరూపానందేంద్ర స్వామి పర్యవేక్షణలో అష్టబంధన మహాకుంభాభిషేక మహోత్సవం ఫిబ్రవరి 14వ తేదీ గురువారం జరుగనుంది. ఈ కుంభాభిషేకానికి వివిధ రాష్ట్రాల నుండి వేదపండితులు హాజరవుతున్నారు. ఇందులో ప్రత్యేకంగా రాజశ్యామల మహాయాగం చేపట్టడంతో యాగ పూర్ణాహుతి కార్యక్రమానికి యూపీ సీఎం ఆదిత్యనాథ్‌ హాజరుకానున్నారు. 

అలాగే.. సీఎం బాబు కూడా ఫిబ్రవరి 14వ తేదీ గురువారం విశాఖ రానున్నారు. ఉదయం విశాఖ ఎయిర్‌పోర్ట్‌కు చేరుకుని.. అక్కడినుంచి విజయనగరం జిల్లా భోగాపురం వెళ్తారు. అక్కడ గ్రీన్‌ఫీల్డ్‌ ఎయిర్‌పోర్ట్‌ నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారు.. ఆ తర్వాత కాపులుప్పాడ ఐజీ సెజ్‌కు చేరుకుంటారు. అక్కడ అదానీ గ్రూపు ఆధ్వర్యంలో ఏర్పాటు కానున్న డేటా కేంద్రానికి భూమి పూజ చేస్తారు. ఈ రెండు కార్యక్రమాలు ముగిసిన తర్వాత మధ్యాహ్నం 12 గంటలకు విమానాశ్రయానికి చేరుకుని.. అక్కడినుండే రిమోట్‌ ద్వారా అచ్యుతాపురం సెజ్‌లో ఏర్పాటు చేసిన ఏషియన్‌ పెయింట్స్‌ సంస్థను ప్రారంభిస్తారు. అనంతరం అమరావతికి తిరుగు పయనమవుతారు. 

ఇక తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ కూడా విశాఖకు రావాల్సి ఉన్నప్పటికీ.. చివరి నిమిషంలో వాయిదా పడింది. దీంతో ఆయన తరపున వేముల ప్రశాంత్‌రెడ్డి శారదా పీఠంలో జరగనున్న కార్యక్రమానికి హాజరవుతారు. మొత్తానికి ఒకేరోజు ఇద్దరు సీఎంలు విశాఖలో పర్యటిస్తున్న నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటుచేశారు.