మోడీతో ముగిసిన జగన్ భేటీ : ప్రధాని దృష్టికి తీసుకెళ్లిన అంశాలు

ఏపీ అభివృద్ధికి కేంద్రం సహకరించాలని కోరారు ఏపీ సీఎం జగన్. కాసేపటి క్రితం పీఎం నరేంద్ర మోడీతో ఆయన జరిపిన భేటీ కాసేపటి క్రితం ముగిసింది. దాదాపు గంటకు పైగా ఈ మీటింగ్ జరిగింది. ఈ సమావేశంలో అనేక అంశాలపై చర్చించారు. రాష్ట్రంలోని రైతులకు వ్యవసాయ పెట్టుబడి కింద ఆర్థిక సాయం అందించేందుకు ప్రవేశపెట్టిన రైతు భరోసా పథకాన్ని ప్రారంభించేందుకు అక్టోబర్ 15వ తేదీన రాష్ట్రానికి రావాల్సిందిగా మోడీని ఆహ్వానించారు సీఎం జగన్. ఒక్కో రైతు కుటుంబానికి రూ. 12 వేల 500 ఇవ్వాలని సీఎం జగన్ నిర్ణయించిన సంగతి తెలిసిందే.
రాష్ట్రానికి రావాల్సిన నిధులు సహా పలు అంశాలపై కేంద్ర పెద్దలతో చర్చించేందుకు సీఎం జగన్ ఢిల్లీకి వచ్చారు. అక్టోబర్ 05వ తేదీ శనివారం సాయంత్రం 4.30గంటలకు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీతో భేటీ అయ్యారు సీఎం జగన్. ఈ సందర్భంగా ఆయన పలు అంశాలను మోడీ దృష్టికి తీసుకెళ్లారు.
> పోలవరం ప్రాజెక్టు పనుల్లో రివర్స్ టెండరింగ్ ద్వారా వెళ్లి డబ్బులను ఆదా చేసినట్లు చెప్పారు. ఈ ప్రాజెక్టుకు కేంద్రం నుంచి రావాల్సిన నిధులను త్వరగా విడుదల చేయాలని కోరారు.
> రాష్ట్రం భారీ రెవెన్యూ లోటుతో ఉన్నందున..అవసరమైన నిధులు కేటాయించాలన్నారు.
> రాజధాని నిర్మాణానికి అవసరమైన ఆర్థిక సాయం అందించాలని విజ్ఞప్తి చేశారు.
> విభజన చట్టంలో పేర్కొన మేరకు రాష్ట్రంలో వెనుకబడిన రాయలసీమ, ఉత్తరాంధ్ర జిల్లాలకు ప్రత్యేక ఆర్థిక సాయం కింద నిధులను వెంటనే విడుదల చేయాలన్నారు.
> గోదావరి జలాలను నాగార్జున సాగర్, శ్రీశైలంకు తరలించేందుకు తెలంగాణ, ఏపీ రాష్ట్రాలు సంయుక్తంగా చేపట్టనున్న ప్రాజెక్టుకు సహకరించాలని కోరారు.
> విశాఖ – కాకినాడ పెట్రో అండ్ పెట్రో కెమికల్ కారిడార్ ఏర్పాటుకు కేంద్రం సహకరించాలన్నారు.
Read More : సీఎం జగన్ ఢిల్లీ టూర్ : మోడీతో భేటీ : రైతు భరోసా కార్యక్రమానికి ఆహ్వానం