ఖాకీ ఓట్లపై కన్ను : పోలీసు ఓట్ల కొనుగోలు

  • Published By: madhu ,Published On : April 19, 2019 / 12:55 PM IST
ఖాకీ ఓట్లపై కన్ను : పోలీసు ఓట్ల కొనుగోలు

Updated On : April 19, 2019 / 12:55 PM IST

AP అసెంబ్లీలో అడుగు పెట్టాలనుకుంటున్న వివిధ పార్టీల అభ్యర్థులు.. ఇప్పుడు పోలీసులు, హోంగార్డుల పోస్టల్‌ బ్యాలెట్లపై దృష్టిపెట్టారు. ప్రతి ఓటు కీలకం కావడంతో పోస్టల్ ఓట్ల కొనుగోలుకు సిద్దమౌతున్నట్లు తెలుస్తోంది. ఈ నెల 11న తొలి విడతలోనే రాష్ట్రంలో అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల పోలింగ్‌ ముగిశాయి. ఒకేరోజు పోలింగ్‌ నిర్వహించడంతో పోలీసులంతా బందోబస్తు విధుల్లోనే ఉన్నారు. దీంతో రాష్ట్రంలోని వివిధ రాజకీయ పార్టీ నాయకులు ఇప్పుడు పోలీస్ పోస్టల్ బ్యాలెట్స్ పై కన్నేశారు.

రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 50వేల మందికిపైగా పోలీసులు, 13వేల మంది హోంగార్డులు పోలింగ్‌ నాడు డ్యూటీ ఉందని .. పోస్టల్‌ బ్యాలెట్‌ ముందే తీసుకున్నారు. ఎన్నికల విధులు ముగియడంతో ఇప్పుడు వారి ఓటుపై అభ్యర్థులు దృష్టి సారించారు. దాదాపు 65 శాతం నియోజకవర్గాల్లో నువ్వా నేనా అన్నట్లు పోటీ ఉండటంతో ఈ ఓట్లపై కన్నేశారు నేతలు. అభ్యర్థులు తమకు పరిచయమున్న కానిస్టేబుళ్ల ద్వారా ఇతర పోలీసుల ఓట్లను కొనుగోలు చేస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. రెండు ప్రధాన పార్టీల నుంచి ఒక్కో ఓటుకు రూ.2 వేల నుంచి రూ.5వేల వరకూ ఆఫర్లు వస్తున్నట్లు తెలుస్తోంది.

కొంతమంది రూ.5 వేల వరకూ ఆఫర్‌ ఇస్తుండగా.. కొంతలో కొంత ఫర్లేదనుకుంటున్న వారు రూ.2 వేలిస్తాం.. పోస్టల్‌ బ్యాలెట్‌ మాకే వేయండని కోరుతున్నట్లు తెలుస్తోంది. శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో రూ.2 వేలు, విశాఖలాంటి నగరంలో రూ. 5 వేల వరకూ డిమాండ్‌ ఉన్నట్లు చెబుతున్నారు. ఉభయ గోదావరి జిల్లాల్లో పోలీసు అధికారుల సంఘం నేతలను పట్టుకుని అభ్యర్థులు ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో పోలీసులతో సంబంధాలు కలిగిన వ్యక్తుల ద్వారా ప్రయత్నాలు జరుగుతున్నాయని అంటున్నారు. 

ప్రస్తుతం హోరాహోరీ పోరు జరుగుతున్న స్థానాల్లో అభ్యర్థులు పోలీసులు, ఇతర ఉద్యోగుల ఓట్లు కొనుగోలు చేసేందుకు వెనుకాడడంలేదు. అయితే కొంతమంది తమకు నచ్చిన వారికి ఓటు వేసుకుంటామని ఆఫర్‌ను తిరస్కరిస్తుండగా.. ఇంకొంత మంది వచ్చేది ఎందుకు వద్దనాలని తీసుకుంటున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ విషయాన్ని కొందరు క్షేత్రస్థాయి పోలీసు అధికారుల వద్ద ప్రస్తావించగా..  పోస్టల్‌ బ్యాలెట్‌ కోసం హెచ్‌సీలు, కానిస్టేబుళ్లు, హోంగార్డులకు ఆఫర్లు వస్తున్న మాట వాస్తవమేనని అంగీకరించారు. 5వేల రూపాయలంటే కింది స్థాయి ఉద్యోగులు ప్రభావితమయ్యే అవకాశముంటుందని విశ్లేషకులు అంటున్నారు.