ఏపీ ప్రభుత్వం నిర్ణయం: మూడు కులాలకు ప్రత్యేక కార్పోరేషన్లు

ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నేరవేరుస్తానని ప్రకటించిన సీఎం జగన్.. ఈ క్రమంలోనే లేటెస్ట్ గా తన హామీలకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో మూడు కులాలకు ప్రత్యేక కార్పొరేషన్లను ఏర్పాటు చేస్తూ వైసీపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
ఏపీ మాల వెల్ఫేర్ కార్పోరేషన్, ఏపీ మాదిగ వెల్ఫేర్ కార్పోరేషన్, ఏపీ రెల్లి కార్పొరేషన్ లను ఏర్పాటు చేసింది. మాదిగలకు ప్రత్యేక కార్పోరేషన్ ఏర్పాటు చేస్తానని ఎన్నికల ప్రచారంలో జగన్ ఇచ్చిన హామీ మేరకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
ఒక్క మాదిగలకే కాదు.. రాష్ట్రంలోని అన్నీ కులాలకు ప్రత్యేక కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తామని జగన్ ఎన్నికల హామీ ఇచ్చారు. ఈ క్రమంలోనే మూడు కులాలను ఆర్థికంగా ఆదుకునేందుకు మొదటివిడతలో ప్రత్యేక కార్పోరేషన్ లు ఏర్పాటు చేశారు.
ఈ మేరకు ఎస్సీ కో ఆపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఎండీకి మూడు కార్పొరేషన్‌లకు సంబంధించి ప్రతిపాదనలు పంపవలసిందిగా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. బీసీల్లో 139 కులాలకు ప్రత్యేకంగా కార్పొరేషన్‌లు ఏర్పాటు చేస్తామని ఎన్నికలకు ముందు జగన్ హామీ ఇచ్చిన విషయం తెలిసిందే.