ఏపీ ప్రభుత్వ టెండర్ల బాధ్యత హైకోర్టు జడ్జీకి అప్పగింత

జ్యుడిషియల్ కమిటీ ఏర్పాటులో ఏపీ ప్రభుత్వం కీలక అడుగు వేసింది. జ్యుడిషియల్ ప్రివ్యూ ప్రక్రియ కోసం హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బి.శివశంకరరావును నియమించింది. జ్యుడిషియల్ కమిటీ కోసం జస్టిస్ శివశంకరరావు పేరును హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సి.ప్రవీణ్‌కుమార్ ఏపీ ప్రభుత్వానికి సూచించారు. ఈ మేరకు బుధవారం (సెప్టెంబర్ 11, 2019) ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కాగా, జస్టిస్ శివశంకరరావు ఈ పదవిలో మూడేళ్ల పాటు కొనసాగనున్నారు. ప్రభుత్వ టెండర్ల బాధ్యతను హైకోర్టు జడ్జీకి అప్పగించింది. రాష్ట్రంలో 100 కోట్లు దాటిన ప్రతి టెండర్‌ను జ్యుడిషియల్ కమిషన్ సమీక్షించనుంది. ప్రాజెక్టులు, టెండర్లను జస్టిస్ బి.శివశంకరరావు సమీక్షించనున్నారు.
ప్రాజెక్టుల నిర్మాణంలో అవినీతి జరగడానికి వీల్లేకుండా, టెండర్ల విధానాన్ని అత్యంత పారదర్శకంగా రూపొందించాలని భావిస్తున్న సీఎం జగన్ జ్యుడిషియల్ కమిషన్ తీసుకురావడానికి కృషి చేశారు. ఇందులో భాగంగానే రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన జ్యుడిషియల్ కమిషన్‌ను బిల్లును ఏపీ అసెంబ్లీ ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే. ఈ బిల్లు ప్రకారం.. పనులను ప్యాకేజీలుగా విభజించినా సరే మొత్తం పని విలువ రూ.100 కోట్ల దాటిన అన్ని మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు కమిషన్ పరిధిలోకి వస్తాయి.
ఇందుకు సంబంధించి ప్రతి అంశాన్ని జడ్జి పరిశీలిస్తారు. జడ్జికి సహాయంగా నిపుణులను నియమిస్తారు. సంబంధిత శాఖ జడ్జి సిఫార్సులను తప్పనిసరిగా పాటించాల్సిందే. ఈ విధానంలో మొత్తం 15 రోజుల్లో టెండర్ ప్రతిపాదన ఖరారు అవుతుంది. ఆ తర్వాతే బిడ్డింగ్ ఎవరికీ అదనపు లబ్ధి చేకూర్చకుండా.. పారదర్శకంగా, నిష్పక్షపాతంగా, ప్రజాధనం దుర్వినియోగం కాకుండా అర్హత ఉన్న కాంట్రాక్టర్లందరికీ సమాన అవకాశాలు అభించనున్నాయి.