శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే ఉపేక్షించం : మంత్రి బొత్స

టీడీపీ చలో ఆత్మకూరు యాత్రపై ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ ఫైర్ అయ్యారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే ఎంతటి వారినైనా ఉపేక్షించబోమన్నారు. చట్టాలను అతిక్రమిస్తే తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. విజయనగరంలో మంగళవారం మంత్రి బొత్స మీడియాతో మాట్లాడుతూ పెయిడ్ ఆర్టిస్టులతో కుటిల రాజకీయాలు చేసేందుకు యత్నిస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబు జిమ్మిక్కులు తమకు తెలుసన్నారు.
టీడీపీ, వైసీపీ నేతల మధ్య అక్కడక్కడా ఘర్షణలు జరుగుతున్నాయన్నారు. యరపతినేని, చింతమనేని, కూన రవి కుమార్, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, కోడెల శివప్రసాదరావు తప్పు చేయలేదని ప్రశ్నించారు. యరపతినేని క్వారీ పరిశీలనకు వెళ్తే తనను అరెస్టు చేయలేదా అని గుర్తు చేశారు. ఏ సమస్య లేకపోయినా విజయనగరం జిల్లా కేంద్రంలో సంవత్సరాల తరబడి సెక్షన్ 30 అమలులో పెట్టలేదా అని ప్రశ్నించారు.