రైతుకు అండగా: వైఎస్ఆర్ భరోసా.. మూడు సార్లు.. తేదీలు ఇవే

YSR రైతు భరోసా పథకం కింద రైతులకు ఇచ్చే పెట్టుబడి సాయాన్ని ఏపీ ప్రభుత్వం పెంచింది. అక్టోబర్ 14వ తేదీ సోమవారం వ్యవసాయ మిషన్ సమీక్ష నిర్వహించారు. సమీక్షకు సంబంధించిన విషయాలను ఏపీ మంత్రి కన్నబాబు మీడియాకు వివరించారు. కేంద్ర ప్రభుత్వాల సహాయం ఉన్నా..దాని గురించి చెప్పకుండా రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహిస్తున్నట్లు చెబుతాయని గత టీడీపీ ప్రభుత్వాన్ని ఆయన విమర్శించారు. కేంద్ర ప్రభుత్వ పథకానికి అనుసంధానం చేస్తూ..వైఎస్సార్ రైతు భరోసా పేరు పెట్టినట్లు, నెల్లూరు జిల్లాలో సీఎం జగన్ అక్టోబర్ 15వ తేదీన ఈ పథకం ప్రారంభమిస్తారని తెలిపారు. సీఎం జగన్ కీలక నిర్ణయాలు తీసుకున్నారని తెలిపారు.
రెండు విడతలుగా ఖరీఫ్, రబీకి పనికి వచ్చే విధంగా అందివ్వాలని వ్యవసాయ మిషన్ వైస్ ఛైర్మన్ నాగిరెడ్డి, సమావేశంలో పాల్గొన్న ప్రతినిధులు సూచించారని తెలిపారు. దీనికి సీఎం జగన్ సానుకూలంగా స్పందించారని, పెట్టుబడి సాయాన్ని రూ. 13 వేల 500 ఇవ్వాలని నిర్ణయించడం జరిగిందన్నారు. ఖరీఫ్ (మే నెలలో) రూ. 7 వేల 500, అక్టోబర్‌లో 4 వేలు, సంక్రాంతి పండుగకు రూ. 2 వేలు ఇచ్చేందుకు ప్రభుత్వం నిర్ణయించడం జరిగిందన్నారు.
గత టీడీపీ ప్రభుత్వం ప్రభుత్వ ఖజానాను ఖాళీ చేసిందని, నిధులను సక్రమమార్గంలో ఖర్చు పెట్ట లేదని విమర్శించారు. అదనంగా భారమైనా..పథకాన్ని అమలు చేస్తామన్నారు. నాలుగేళ్ల పాటు ఈ పథకాన్ని అమలు చేయాలని భావించినా..మరో సంవత్సరం పెంచాలని ప్రభుత్వం డిసైడ్ చేసిందన్నారు. గతంలో వైఎస్సార్ రైతుల గురించి ఎన్ని పథకాలు అమలు చేశారో గుర్తు చేసుకోవాలన్నారు. వ్యవసాయ రంగానికి కొత్త స్వరూపం చేయాలని ప్రభుత్వం ఆలోచిస్తోందన్నారు మంత్రి కన్నబాబు.
Read More : రైతులకు శుభవార్త : YSR రైతు భరోసా రూ. 13 వేల 500