కోహ్లీకీ ఇలానే చేస్తే..: అశ్విన్ ప్రవర్తనకు వార్న్ కన్నీరు

కోహ్లీకీ ఇలానే చేస్తే..: అశ్విన్ ప్రవర్తనకు వార్న్ కన్నీరు

Updated On : March 26, 2019 / 10:14 AM IST

బీసీసీఐ ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తోన్న ఐపీఎల్‌లో సోమవారం రాత్రి జరిగిన మ్యాచ్ పెద్ద దుమారమే రేపింది. రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌కు మధ్య జరిగిన మ్యాచ్‌లో జోస్ బట్లర్ రనౌట్‌పై విశ్లేషకులతో పాటు సీనియర్లంతా మండిపడుతున్నారు. ఈ క్రమంలో ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ షేన్ వార్న్.. ట్విట్టర్ వేదికగా తన ఆవేదన వ్యక్తం చేశాడు. క్రీడా స్ఫూర్తికి పూర్తిగా విరుద్ధంగా అశ్విన్ ప్రవర్తించాడని తిట్టిపోశాడు.

‘చాలా నిరుత్సాహానికి గురైయ్యాను. అశ్విన్ ఓ కెప్టెన్‌గా, ఓ ప్లేయర్‌గా తనపై ఉన్న నమ్మకాన్ని పోగొట్టుకున్నాడు. క్రీడా స్ఫూర్తితో ఆడితే ఎలాంటి చర్యనైనా ఒప్పుకుంటాం. కానీ ఇది విరుద్ధం. బంతి వేయడానికి ప్రయత్నించలేదు. అవుట్ చేసేందుకే కాచుకుని కూర్చొన్నట్లుగా ఉంది. అసలు దీనిని డెడ్ బాల్‌గా ఫ్రకటించాలి. బీసీసీఐ దీనిపై చర్యలు తీసుకోవాలి. ఐపీఎల్‌కు ఈ ఆటతీరు మంచిది కాదు’

‘ఒక కెప్టెన్‌గా జట్టుకు నువ్వు ఆదర్శం కావాల్సింది ఇలా ప్రవర్తిస్తావా.. కింగ్స్ ఎలెవన్ పంజాబ్ వేలాది మంది నుంచి అభిమానం పోగొట్టుకుంది. మీ గురించి మీరే చూసుకుంటారా.. అశ్విన్ నువ్వు క్షమించమని అడగడానికి కూడా ఆలస్యమైంది. గుర్తుపెట్టుకో దీనికి తగింది అనుభవిస్తావు’

‘విలువలేని, అవమానకరమైన అశ్విన్ ప్రవర్తనపై చివరిగా ఒక్క విషయం. ఈ విజయం మానసికంగా మిమ్మల్ని సంతృప్తిపరచలేదు. క్రీడా స్ఫూర్తికి విరుద్ధంగా ఆడావు. యువ అభిమానులకు క్రికెట్ ఎలా ఆడకూడదో నిన్ను చూసి నేర్పించాలి’

‘క్షమించాలి- మరో విషయం బెన్ స్టోక్స్ కూడా కోహ్లీని ఇలా అవుట్ చేస్తే మీకు ఓకేనా.. నువ్వు విలువలు కోల్పోయావు అశ్విన్. బీసీసీఐ ఏదో ఒకటి చేస్తుందని ఆశిస్తున్నా’ అని ట్వీట్లతోనే తన ఆవేదన వ్యక్తం చేశాడు షేన్ వార్న్.