నెల్లూరు రాజకీయాల్లో కుదుపు: టీడీపీకి రాజీనామా.. నేడే వైసీపీలోకి బీదా

తెలుగుదేశం పార్టీకి ఆర్థికంగా బలంలగా ఉన్న నేతలైన సుజనా చౌదరి, సీఎం రమేష్ వంటి నేతలు దూరమవగా.. ఆ పార్టీలో ఆర్థికంగా బలంగా ఉన్న మరో తెలుగుదేశం నేత, పారిశ్రామిక వేత్త బీదా మస్తాన్ రావు దూరం అవుతున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీ బలం ఎక్కువగా ఉన్న జిల్లాలలో నెల్లూరు జిల్లా ఒకటి. క్రితం ఎన్నికల్లో ఈ జిల్లాలో నెల్లూరు పార్లమెంటు నియోజకవర్గం నుంచి పోటీ చేసిన తెలుగుదేశం నాయకులు బీదా మస్తాన్ రావు ఇప్పుడు వైసీపీ కండువా కప్పుకునేందుకు సిద్ధం అయ్యారు.
ఈ క్రమంలోనే తెలుగుదేశం పార్టీకి బీదా మస్తాన్‌రావు రాజీనామా చేశారు. రాజీనామా లేఖను పార్టీ కార్యాలయానికి పంపారు. ఇవాళ(07 నవంబర్ 2019) మధ్యాహ్నం 12గంటల 40నిమిషాలకు సీఎం క్యాంప్ ఆఫీసులో వైసీపీలో చేరే అవకాశం ఉంది. మరోవైపు ఆయన సోదరుడు బీదా రవిచంద్ర మాత్రం టీడీపీలోనే కొనసాగాలని నిర్ణయం తీసుకున్నారు.
బీదా మస్తాన్ రావు రాజశేఖర్ రెడ్డి రెండవసారి గెలిచినప్పుడు 2009లో కావలి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. గత ఎన్నికల్లో మాత్రం ఆ నియోజకవర్గం నుంచి టీడీపీ తరపున కాటంరెడ్డి విష్ణువర్థన్ రెడ్డి పోటీ చేయగా.. నెల్లూరు పార్లమెంట్ స్థానానికి పోటీ చేసి ఓడిపోయారు బీద. వైసీపీ అభ్యర్థి ఆదాల ప్రభాకర్ రెడ్డి మీద పోటీచేసి 1,48,571 ఓట్ల తేడాతో ఓటమిపాలయ్యారు.
ఎన్నికలకు ముందు కూడా బీద మస్తాన్ రావుపై ఐటీ దాడులు జరగడంతో రాజకీయంగా ఇబ్బంది పెడుతున్నారనే ఆరోపణలు వినిపించాయి. కావలి నియోజకవర్గంలోని అల్లూరు, దగదర్తి, బోగోలు మండాలాల్లో బీదా మస్తాన్ రావుకు పట్టు ఉంది. అయితే 2014లో మాత్రం బీదా వైసీపీ అభ్యర్థి రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డిపై ఓడిపోయారు. ఇటీవల సీఎం వైఎస్ జగన్ పాల్గొన్న ఆక్వా రైతుల సదస్సుకు బీదా మస్తాన్ రావు హాజరైనప్పటి నుంచి ఆయన పార్టీ మారుతారనే వార్తలు వినిపించాయి.
ఇక బీదా మస్తాన్ రావుకు రాజ్యసభ సీటు వచ్చే అవకాశం ఉన్నట్లుగా జోరుగా ప్రచారం సాగుతుంది. నెల్లూరు జిల్లాలో పార్టీ కార్యక్రమాలను ముందుకు నడిపిస్తున్న బీద పార్టీకి రాజీనామా చేయడం నెల్లూరు టీడీపీకి నష్టంగానే చెప్పాలి. నెల్లూరు రాజకీయాల్లో ఇది ఒక కుదుపుగా కూడా భావిస్తున్నారు విశ్లేషకులు.