కష్టం తీర్చేందుకు కలెక్టర్ గారే వస్తే.. ఏం కావాలి పెద్దమ్మా

  • Published By: vamsi ,Published On : February 27, 2020 / 01:13 AM IST
కష్టం తీర్చేందుకు కలెక్టర్ గారే వస్తే..  ఏం కావాలి పెద్దమ్మా

Updated On : February 27, 2020 / 1:13 AM IST

ప్రభుత్వ ఉద్యోగులు అంటే ఎలా ఉంటారని అనుకుంటాం.. దర్జాగా ఓ పెద్ద కుర్చీలో కూర్చొని పక్కన బంట్రోతు, అటెండర్‌లను పెట్టుకుని పనులు చేయించుకుంటూ.. ఠీవీగా కాలు మీద కాలు వేసుకుని.. ప్రభుత్వంలోని పెద్దలకు పాదాలొత్తుతూ.. ప్రజా సమస్యలు పట్టించుకోకుండా ఎక్కువ మంది కనిపిస్తున్నారు కదా? కానీ ఈ ఫోటోలో పెద్దావిడతో మాట్లాడుతుంది ఎవరో తెలుసా? ఓ జిల్లా కలెక్టర్ గారు. పింఛన్ రాట్లేదని, కలెక్టర్ ఆఫీస్‌కి వచ్చిన ఓ అవ్వను చూసి కలెక్టర్ గారే దగ్గరకు వచ్చి సమస్యను పరిష్కరించారు.

Abdul Azeem

వివరాల్లోకి వెళ్తే.. తెలంగాణలోని జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టరేట్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. పింఛన్ కోసం రెండేళ్లుగా జయశంకర్ భూపాలపల్లి మండలం గుర్రంపల్లి గ్రామానికి చెందిన అజ్మీర మంగమ్మ (70) అనే అవ్వ అధికారుల చుట్టూ తిరుగుతుంది. చివరి ప్రయత్నంగా కలెక్టర్ కార్యాలయానికి రాగా.. కార్యాలయంలో కలెక్టర్ లేరని సిబ్బంది చెప్పారు. చేసేదేంలేక అక్కడే కూర్చుండిపోయింది. ఇంతలో ఓ కార్యక్రమం ముగించుకుని వచ్చిన కలెక్టర్ గారే వృద్ధురాలిని చూసి ఆమె దగ్గరకు వచ్చాడు.

See Also>>తెలంగాణలో 7 to 11 క్లాసులకు యూట్యూబ్ పాఠాలు..

‘ఏం పెద్దమ్మా.. ఏం కావాలి’ అని అడిగాడు. దానికి అవ్వ బదులిస్తూ.. ‘రెండేండ్ల నుంచి పింఛన్ వస్తలేదు బిడ్డా.. సారును కలుద్దామని వచ్చినా’ అంది. అంతే చలించిపోయారు కలెక్టర్. ఆమెతో పాటు అక్కడే మెట్లపై కూర్చొని ఎంతో ఆప్యాయంగా మాట్లాడి వివరాలు తెలుసుకున్నాడు. సంబంధిత అధికారికి ఫోన్ చేసి సమస్య తెలుసుకుని క్షణాల్లో పరిష్కరించాడు. ఆ జయశంకర్ భూపాలపల్లి జిల్లా పేరు మొహమ్మద్ అబ్దుల్ అజీం.

సమస్య తీరేవరకు కూడా ఆ అవ్వకు నమ్మకం లేదు. తన సమస్య తీరుతుందని, ఎందుకంటే ఆ మాట్లాడే వ్యక్తి కలెక్టర్ అని ఆ అవ్వకు తెలియదు. కలెక్టర్ కూడా తానేవరో ఆమెకు చెప్పలేదు. పెద్దమ్మ సమస్యను మాత్రం క్షణాల్లో పరిష్కరించారు.  ఎంతో ఓపికగా ఆమె సమస్య విన్నది కలెక్టర్ గారే అని తెలుసుకుని చివరికి అవ్వ ఆశ్చర్యపోయింది. కలెక్టర్ నిరాడంబరత్వం మంచితనాన్ని మచ్చుకుని అతనిని చల్లగా ఉండాలంటూ ఆశిర్వదించింది అవ్వ.

మెట్లపై కూర్చొని వృద్ధురాలితో మాట్లాడుతున్నప్పటి కలెక్టర్ మొహమ్మద్ అబ్దుల్ అజీం ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కలెక్టర్ పనితీరుపై పలువురు ప్రశంసలు కురిపిస్తున్నారు. ప్రజలు తమ సమస్యలు చెప్పుకునేందుకు రావాలంటే ప్రభుత్వ ఉద్యోగులు ఇలానే ప్రవర్తించాలని పలువురు అభిప్రాయపడుతున్నారు.

Read Miore>>జెన్ సక్సెస్ స్టోరీ : లావుగా ఉందని వరుడు వదిలేశాడు.. కట్ చేస్తే.. మిస్ బ్రిటన్ విన్నర్ అయ్యింది