అతిపెద్ద పనస పండు @ 70కిలోలు

రాజమండ్రి: పనస తొనల తియ్యదనం చెప్పాలంటే మాటలు చాలవు. పనస పొట్టు కూర ప్రత్యేక మైన రుచితో శాఖాహారుల నోరూరిస్తూ ఉంటుంది. వేసవికాలం వచ్చిందంటే పనసపండ్లు అందుబాటులోకి వస్తాయి. పండ్లజాతిలో ప్రపంచంలోనే అత్యంత పెద్ద పండుగా పేరున్న పనసపండు సాధారణంగా 5 కేజీల నుంచి 20 కేజీల బరువుతో కాస్తాయి. తూర్పుగోదావరి జిల్లా పిఠాపురానికి చెందిన ముమ్మిడి వీర వెంకట సత్యనారాయణ పొలంలో కాసిన పనస పండు ఏకంగా 70 కేజీలు తూగింది. ఎటువంటి ఎరువులు, పురుగు మందులు వేయకుండా, ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో సాగు చేసి పండించిన ఈపండు ఇప్పడు పలువురిని ఆకర్షిస్తోంది. కాయ తయారవుతుండగానే భారీగా తయారవుతుందని గమనించి తగిన జాగ్రత్తలు తీసుకుని రక్షణ ఏర్పాట్లు చేయటం వల్ల ఇంత పెద్దగా తయారైనట్లు రైతు సత్యనారాయణ తెలిపారు.