గోదావరి టైటానిక్ : ఆపరేషన్ రాయల్ వశిష్ట

ఆపరేషన్ రాయల్ వశిష్ట బోటు వెలికితీత ప్రక్రియ కొనసాగుతోంది. సెర్చ్ ఆపరేషన్‌లో మూడోరోజు (అక్టోబర్ 02వ తేదీ బుధవారం) తీవ్ర నిరాశను మిగిల్చింది. బోటును వెలికి తీసేందుకు దర్మాడి సత్యం చేసిన ప్రయత్నాలేవీ ఫలించలేదు. మూడో రోజు ఆపరేషన్లో భాగంగా దర్మాడి బృందం మరోసారి ప్లాన్-2 ను అమలు చేసింది. సుమారు 200 కేజీల బరువైన భారీ యాంకర్‌తో బోటు మునిగిన ప్రాంతంలో జల్లెడ పట్టారు.
అయితే వారి శ్రమ ఫలించలేదు. ఉదయమంతా యాంకర్ వేసినప్పటికీ ఏమీ తగలక పోవడంతో నిరాశే మిగిలింది. మధ్యాహ్నం నుంచి భారీ వర్షం కురవడంతో ఆపరేషన్ ను పూర్తిగా నిలిపివేయాల్సి వచ్చింది. దీంతో మూడో రోజు ఆపరేషన్‌లో పురోగతేమీ కనిపించలేదు. ఇక అక్టోబర్ 03వ తేదీ గురువారం ఆపరేషన్‌ను ఎలాగైనా సఫలం చేయాలని ప్రయత్నిస్తోంది దర్మాడి బృందం.
ప్లాన్-2ను అమలు చేయడానికి ధర్మాడి బృందం సిద్ధమవుతోంది. యాంకర్ ద్వారా మరోసారి ప్రయత్నించి అది విఫలం అయితే మళ్లీ ప్లాన్-1 ను అమలు చేయడానికి దర్మాడి బృందం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. మరోవైపు దర్మాడి బృందం అమలు చేసిన ప్లాన్స్ విఫలం అవుతుండడంతో బోటు వెలికితీతపై అశలు సన్నగిల్లుతున్నాయి. దీనికితోడు ఏజెన్సీలో భారీ వర్షాలు కురవడంతో నదీ ప్రవాహం మరింత పెరిగే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. వరద ఉద్ధృతి పెరిగితే ఆపరేషన్ రాయల్ వశిష్టను పూర్తిగా నిలిపివేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. అదేగాని జరిగితే రాయల్ వశిష్ట బోటు గోదావరి టైటానిక్‌గా చరిత్రలో మిగిలిపోనుంది.
Read More : కచ్చులూరులో భారీ వర్షం : మూడోరోజు నిలిచిన బోటు వెలికితీత పనులు