OMG : లోయలో పడిన ఆర్టీసీ బస్సు

వరస రోడ్డు ప్రమాదాలు భయపెడుతున్నాయి. వాటికి కొనసాగింపుగా అన్నట్లు.. తెలంగాణ రాష్ట్రం జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఆర్టీసీ బస్సు ప్రమాదానికి గురైంది. అదుపు తప్పి రోడ్డు పక్కన ఉన్న లోయలోకి పల్టీలు కొట్టింది. అందులో ప్రయాణిస్తున్న 63 మంది ప్రయాణికులు స్వల్ప గాయాలతో బయటపడ్డారు.
వివరాల్లోకి వెళితే గోదావరి ఖని – భూపాలపల్లికి మే 15వ తేదీ బుధవారం ఆర్టీసీ బస్సు వెళుతోంది. బస్సులో 63 మంది ప్రయాణీకులున్నారు. మల్హర్ మండలం అడవి సోమనపల్లి బ్రిడ్జీ వద్దకు చేరుకున్న ఆర్టీసీ బస్సు అదుపు తప్పింది. పక్కనే ఉన్న లోయలో పడిపోయింది. అద్దాలు పగులగొట్టుకుని ప్రయాణికులు బయటకు వచ్చారు. ఆ రోడ్డులో వెళుతున్న వాహనదారులు కూడా ప్రయాణికులను కాపాడారు.
కొంతమంది తలలకు గాయాలయ్యాయి. మరికొంతమంది చేతులు, కాళ్లకు గాయాలయ్యాయి. ప్రమాదం జరిగిన వెంటనే బస్సు డ్రైవర్ పరారయ్యాడు. ప్రమాదం జరిగిన విషయం తెలుసుకున్న అనంతరం 108 వాహనంలో గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు. కాటారం, మంథని ఆసుపత్రుల్లో వీరికి చికిత్స అందిస్తున్నారు. ఐదుగురు ప్రయాణీకులు తీవ్రంగా గాయపడ్డారు. సంఘటనపై ఉన్నతాధికారులు ఆరా తీస్తున్నారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు.