అమరావతిలో టెన్షన్ టెన్షన్: జగన్ కాన్వాయ్ కి అడ్డు పడిన రైతులు

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిపై అనుమానాలు వస్తున్న క్రమంలో ఆ ప్రాంత రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే రాజధాని ప్రాంతంలో రైతులు మంగళవారం (27 ఆగస్ట్ 2019) ఉదయం సీఎం జగన్ కాన్వాయ్ కు అడ్డుపడ్డారు. కాన్వాయ్ వస్తున్న సమయంలో సీఎంకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు రాజధాని రైతులు. సచివాలయంకి వెళ్తుండగా తమకు న్యాయం చెయ్యాలని తాళ్లాయపాలెం, మందడం గ్రామాల దగ్గర రైతులు నినాదాలు చేశారు. రైతుల ఆందోళనల్ని కాన్వాయ్‌లో నుంచి గమనించిన సీఎం జగన్.. కాన్వాయ్ లోపల నుంచి రైతులకు అభివాదం చేస్తూ అక్కడి నుంచి వెళ్లి పోయారు.
రాజధాని పరిధిలోని గ్రామాల్లో కొందరు రైతులు ఏదో ఒక చోట నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. మంత్రి బొత్స సత్యనారాయణ, ఎంపీ టీజీ వెంకటేష్ రాజధానిపై చేసిన వ్యాఖ్యలు ఆందోళన కలిగిస్తుండడంతో.. రాజధానిపై స్పష్టమైన ప్రకటన చేయాలని రైతులు, కౌలు రైతులు, టీడీపీ నాయకులు డిమాండ్ చేస్తున్నారు.
ఇటీవలే బీజేపీ నేతలు సుజనా చౌదరి, కన్నా లక్ష్మీ నారాయణ కూడా రాజధాని ప్రాంతాల్లో పర్యటించి రైతులతో పాటు ఆందోళనలో పాల్గొన్నారు. ఈ క్రమంలో రాజధాని అమరావతి ప్రాంతంలోని రైతుల్లో అయోమయం నెలకొంది. మంత్రి బొత్స మాత్రం తన వ్యాఖ్యలను సమర్ధించుకుంటున్నారు. అసలు రాజధాని మారుస్తామని చెప్పలేదని.. ముంపు ప్రాంతంలో ఉందని మాత్రమే ఉందని చెబుతున్నారు. మంత్రి బొత్స వ్యాఖ్యల తర్వాత రాజధాని ప్రాంతంలో భూముల ధరలు బాగా తగ్గాయనే ప్రచారం కూడా జరుగుతుంది.